జాతీయం

Viral News: శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని పెళ్లి చేసుకున్న యువతి, ఇదెక్కడి విచిత్రం!

తాజాగా ఓ యువతి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెళ్లి చేసుకుని సంచలనం కలిగించింది. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం చేసుకోవడం విశేషం. విగ్రహాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటని జనాలు ఆశ్చర్యపోతున్నారు.

కొంత మంది చేసే పనులు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఓ యువతి చేసిన పని చూసి అందరూ షాక్ అవుతున్నారు. బుడాన్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల పింకీ శర్మ ఏకంగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెళ్లి చేసుకోవడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. శ్రీకృష్ణుడి విగ్రహానికి పూలమాలలు వేసి సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకుంది. ఇస్లాంనగర్ ప్రాంతంలో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు పెద్దఎత్తున తరలివచ్చి ఘనంగా నిర్వహించారు.

అట్టహాసంగా కృష్ణుడితో పెళ్లి!

పింకీ శర్మ ఇంటి దగ్గర పెళ్లి వేదిక వేశారు.  కృష్ణుడి ప్రతిమను పెళ్లికొడుకులా ముస్తాబు చేసి ఘనంగా బారాత్ నిర్వహిస్తూ కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. పింకీ తల్లిదండ్రులు శ్రీకృష్ణుడి విగ్రహానికి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత పింకీ.. విగ్రహాన్ని తన చేతులతో పెళ్లి వేదికపైకి తీసుకెళ్లారు. శ్రీకృష్ణుడి విగ్రహానికి పూలమాల వేసి, తన మెడలో పూలమాల వేసుకుని నుదుట సింధూరం పెట్టుకున్నారు. ఇక స్వామివారి విగ్రహాన్ని చేతుల్లో పట్టుకుని ఏడడుగులు కూడా వేశారామె. పెళ్లి క్రతువు పూర్తవగానే విందుభోజనాలు ఏర్పాటుచేశారు. పెళ్లికి వచ్చిన కొందరు కళాకారులు డ్యాన్సులు, భజన కార్యక్రమాలతో అలరించారు. చివరగా విగ్రహాన్ని చేతిలో పట్టుకుని పింకీ అత్తారింటికి వెళ్లే కార్యక్రమం కూడా జరిపించారు. అయితే.. పింకీ మాత్రం.. ఆమె తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నట్టు సమాచారం.

శ్రీకృష్ణుడిని ఎందుకు పెళ్లి చేసుకుందంటే?  

శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెళ్లి చేసుకోవడం గురించి పింకీ తండ్రి సురేష్ ఆసక్తికర విషయం చెప్పారు.  “చిన్నప్పటి నుంచి తన కూతురుకు శ్రీకృష్ణుడంటే ఇష్టం. నిత్యం ఆయన సేవలో మునిగితేలుతూ ఉంటుంది. ఇటీవల ఆమె అనారోగ్యానికి గురైంది. బృందావనంలో కృష్ణుడి విగ్రహాన్ని మోసుకెళ్లి గోవర్ధన పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసింది. స్వామివారి ప్రసాదం తీసుకుంటున్న సమయంలో ఒక బంగారు ఉంగరం ఆమె చున్నీలో పడింది. అది సాక్షాత్తు తాను కొలిచే కృష్ణుడే ఆశీర్వదించి ఇచ్చాడని భావించింది. ఆ క్షణమే తనను తాను స్వామివారికి అంకితం చేసుకుంది” అని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button