ఆంధ్ర ప్రదేశ్జాతీయం

తిరుమల శ్రీవారి నడకమార్గం మూసివేత

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాయలసీమ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. ముఖ్యంగా తిరుపతి, అన్నమయ్య, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం అస్తవ్యస్థమవుతోంది. వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి.

తిరుపతిలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. తిరుమల ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు.భారీ వర్షాల కారణంగా తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు టీటీడీ ఉన్నతాధికారులతో వర్చువల్ గా సమావేశాన్ని నిర్వహించారు.భారీ వర్షాల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ఈవో. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచి ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఘాట్ రోడ్లలో జేసీబీలను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు.

ట్రాఫిక్ పోలీసులు ఇంజినీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు ఈవో శ్యామలరావు. విద్యుత్ కు అంతరాయం కలకగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఐటీ వింగ్ భక్తుల దర్శనాలు, వసతి, ప్రసాదం వంటి కార్యాకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయం చూసుకోవాలన్నారు. వైద్య శాఖ అంబులెన్సు లను అందుబాటులో ఉంచాలన్నారు.ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అగ్ని మాపక సిబ్బంది వేగంగా స్పందించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే పాపవినాశనం, శిలా తోరణం మార్గాలను టీటీడీ మూసివేసింది. వాతావరణ పరిస్థితులను బట్టి ఈ మార్గాల్లో రాకపోకలను టీటీడీ పునరుద్ధరించనుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button