పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా సన్న బియ్యం పంపిణీపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. పేదలకు మంచి నాణ్యత గల ఆహారం అందించాలనే లక్ష్యంతో సన్న బియ్యం పంపిణీ ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకానికి సంబంధించిన మొత్తం క్రెడిట్ ఆయనకే చెందుతుందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం సన్న బియ్యం సరఫరా కోసం ప్రభుత్వం రూ.14,560 కోట్లు ఖర్చు చేస్తోందని, పేదల కడుపు నిండేలా మంచి ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని, ప్రజలు తినే ఆహారమే వారికి అందించాలనే భావనతో ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 86 శాతం జనాభాకు సన్న బియ్యం అందుతున్నదని, సోనియా గాంధీ ప్రవేశపెట్టిన ఫుడ్ సెక్యూరిటీ చట్టానికి తెలంగాణలో సముచితంగా అమలు జరుగుతోందని వివరించారు.
రైతుల సంక్షేమం విషయంలో కూడా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లోకి మొత్తం రూ.40,000 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 48 గంటల్లోనే వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇది రైతులకు ఆర్థిక భరోసాను కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని, ఇప్పటివరకు 3 కోట్లు 39 లక్షల మంది సన్న బియ్యం లబ్ధిదారులుగా ఉన్నారని తెలిపారు. రేషన్ కార్డుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, దీనికి ఎలాంటి గడువు లేదని చెప్పారు. అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి రేషన్ కార్డులు మంజూరు చేస్తారని వివరించారు.
ఇదిలా ఉండగా రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ నెలలోనే మూడు నెలల రేషన్‌ను ఒకేసారి అందించేందుకు సిద్ధమైంది. దీనివల్ల లబ్ధిదారులు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్‌ను ఒకే విడతలో పొందనున్నారు. ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు సౌకర్యం కల్పించడంతో పాటు వేసవి సమయంలో ఇబ్బందులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అదనంగా వచ్చే నెలలో కొత్త రేషన్ దుకాణాలను ప్రారంభించేందుకు కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి లక్ష్యంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.
ALSO READ: స్టేడియంలో గందరగోళం!.. కేకేఆర్ జెర్సీ ధరించిన అమ్మాయికి ప్రపోజ్ చేసిన అభిమాని
