తెలంగాణరాజకీయం

చింతపల్లిలో కొనసాగుతున్న ‘షాడో’ పాలన…!

  • సతుల పదవులు.. పతుల వైభోగం..
  • చింతపల్లిలో సాగుతున్న ‘షాడో’ పాలన!

చింతపల్లి (క్రైమ్ మిర్రర్):- పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు…ఇది మహాత్మా గాంధీ కన్న కల. గ్రామ స్వరాజ్యం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని, నమ్మిన మన రాజ్యాంగ కర్తలు, స్థానిక సంస్థల్లో మహిళలకు పెద్దపీట వేశారు. స్త్రీలు పరిపాలనలో భాగస్వాములు కావాలని రిజర్వేషన్లు కల్పించారు. కానీ, చింతపల్లి మండలంలో పరిస్థితి చూస్తుంటే రాజ్యాంగ ఆశయాలు తుంగలో తొక్కుతున్నట్లు కనిపిస్తోంది.

మహిళా సర్పంచ్‌లు కేవలం నామమాత్రపు సంతకాలకే పరిమితమవుతుండగా, వారి భర్తలు ‘షాడో సర్పంచ్‌లుగా’ చలామణి అవుతున్నారు. మండలంలోని ఓ గ్రామంలో వసంత పంచమి నాడు, మహిళా సర్పంచ్ లకు బదులుగా, వారి భర్తలు అంగన్వాడీ కేంద్రాలలో అక్షరాబ్యాసం చెయ్యడం, వారికి మద్దతుగా అంగన్వాడీ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు సపోర్ట్ గా ఉండటం చర్చనీయాంశంగా మారింది..

నేటికి గ్రామాలలో మహిళా సర్పంచ్‌ల హక్కులు కాలరాయబడుతున్నాయని ఈ సందర్బంగా తెలుస్తుంది..! రాజ్యాంగ బద్ధంగా ప్రజలచే ఎన్నుకోబడిన మహిళా ప్రతినిధులను పక్కన పెట్టి, వారి భర్తలు అధికారిక కార్యక్రమాల్లో హంగామా చేయడం ఇప్పుడు మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనుల శంకుస్థాపనల వంటి కార్యక్రమాలు ‘పతుల’ రాజ్యమే నడుస్తోంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలిపెట్టుగా మారింది.

— ​పురుషాధిపత్యం.. ఇంకా ఎంతకాలం..!?

​సమాజం ఆధునికత వైపు అడుగులు వేస్తున్నా, రాజకీయాల్లో మాత్రం స్త్రీలపై పురుషాధిపత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. మహిళా సర్పంచ్‌లను ఒక రబ్బర్ స్టాంపుల్లా వాడుకుంటూ, తెర వెనుక భర్తలు చక్రం తిప్పుతున్నారు. గతంలో కూడా పంచాయతీ సమావేశాల్లో సర్పంచ్ కుర్చీలో భర్తలు కూర్చోవడం, అధికారులతో చర్చలు జరపడం పరిపాటిగా మారింది. మహిళా సర్పంచ్‌లు అందుబాటులో లేకపోవడంతో, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే మహిళా గ్రామీణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గ్రామ నిధులు, పనుల కేటాయింపులో సర్పంచ్ భర్తల జోక్యం పెరిగిపోవడంతో, అవినీతికి ఆస్కారం ఉంటోందని విమర్శలు వస్తున్నాయి. చట్ట సభల్లో మహిళలకు ప్రాధాన్యత పెరగాలని రిజర్వేషన్లు ఇస్తే, ఆ పదవులను భర్తలు అనుభవించడం రాజ్యాంగ విరుద్ధమనే చెప్పుకోవాలి. ఇది కేవలం మహిళా ప్రతినిధులనే కాకుండా, వారిని ఎన్నుకున్న ఓటర్లను కూడా అవమానించడమే కదా.. ​కళ్ల ముందే నిబంధనలు ఉల్లంఘించబడుతున్నా, అధికారులు మౌనంగా ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రోటోకాల్ ప్రకారం మహిళా సర్పంచ్‌లకే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా, కొందరు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి సర్పంచ్ పతులకే సలాం కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ​చింతపల్లి మండలంలో ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, మహిళా సర్పంచ్‌లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా, వారి అధికారాల్లో ఇతరుల జోక్యం లేకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు. మహిళా సాధికారత అనేది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, పాలనలో ప్రతిబింబించాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button