
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ (TDF) 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అమెరికాలో ‘ప్రగతి తెలంగాణం’ పేరిట టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీఎఫ్ ఆమెరికా అధ్యక్షుడు మణికొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మిల్పిటాస్ సిటీలోని ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లో ఈ వేడుకలు జరుగుతున్నాయి. తొలి రోజు టీడీఎఫ్ తరుపున సేవలు అందించిన సీనియర్ నాయకులు టీఆర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, దివేష్ అనిరెడ్డి, చల్లా కవితలను టీడీఎఫ్ టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడుతూ స్పెషల్ వీడియోలను ప్రదర్శించారు.
ఈ వేడుకలకు తెలంగాణ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదందరాం, తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ అకునూరి మురళి (రిటైర్డ్ IAS), మాజీ ఎంపీ ఆత్మచరణ్ రెడ్డి, సాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ డా. కే. శ్రీకర్ రెడ్డి, ఎంవీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ ఈ. వెంకటరెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డా. ఎం.వి. రెడ్డి (రిటైర్డ్ IAS), తదితరులు ఇండియా నుంచి ప్రత్యేకంగా హాజరయ్యారు.
శనివారం (ఆగస్టు 9) ఉదయం 10 నుంచి 12 గంటల వరకు తెలంగాణ బిజినెస్ ఫోరం, మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు పాలిటికల్ ఫోరం, 2 నుంచి 3 వరకు స్టార్టప్ ఫోరం, 3 నుంచి 5 వరకు CEO/CFO ఫోరం – విజన్ 2050, సాయంత్రం 6 నుంచి రాత్రి 11 వరకు తెలంగాణ ఫోక్ నైట్ జరుగుతాయి.
ఆదివారం (ఆగస్టు 10) ఉదయం 8 నుంచి 10 గంటల వరకు టీడీఎఫ్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. టీడీఎఫ్ 25 వసంతాల వేడుకల ద్వారా తెలంగాణ అభివృద్ధి, వ్యాపారం, సాంకేతిక రంగం, స్టార్టప్ అవకాశాలు, సాంస్కృతిక వారసత్వం వంటి విభిన్న అంశాలపై చర్చలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో టీడీఎఫ్ బృందం ఈ కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.