జాతీయం

ఘనంగా దలైలామా పుట్టినరోజు వేడుకలు, ప్రధాని మోడీ శుభాకాంక్షలు!

Dalai Lama Birthday: ఆధ్యాత్మిక మత గురువు దలైలామా 90వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ లోని ధర్మశాలలో జరిగిన ఈ వేడుకల్లో దలైలామా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలు దేశాల ప్రతినిధులు, రాజకీయ నేతలు, పెద్ద సంఖ్యలో బౌద్ధులు, టిబెటన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన దలైలామా.. ప్రజల ప్రేమ తనను అన్ని జీవులకు సేవ చేసే మార్గంలో నడిపిస్తుందన్నారు. కరుణ, జాలి కలిగిన హృదయంతో జీవించడం వల్లే మనశ్శాంతిని పొందే అవకాశం ఉందన్నారు. ఒక బౌద్ద సన్యాసిగా తనకు పుట్టిన రోజు జరపుకోవడం ఇష్టం లేదన్న ఆయన.. తన జీవితంలో వెనక్కి తిగిరి చూసుకుంటే, ఏ క్షణం కూడా వృథా చేసుకోలేదన్ననారు. దలైలామా బిరుదుతో తనకు ఎలాంటి గర్వం, అహంకారం రాలేదన్నారు. బుద్ధుడు అనుసరించిన మార్గంలో పయణిస్తూ, ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం అన్నారు. ఆ దిశగానే ఇప్పటి వరకు అడుగులు వేశానని, ఇక ముందుగా కూడా వేయబోతున్నానని దలైలామా తెలిపారు.

బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న పలు దేశాల ప్రతినిధులు

దలైలామా బర్త్ డే వేడుకల్లో కేంద్ర మంత్రులు కిరణ్‌ రిజిజు, రాజీవ్‌ రంజన్‌ సింగ్, అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమాఖండూ, సిక్కిం మంత్రి సోనమ్‌ లామా, హాలీవుడ్‌ నటుడు రిచర్డ్‌ గేర్, ఇటలీ, అమెరికా సహా పలుదేశాల ప్రతినిధులు హాజరయ్యారు.

దలైలామాకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

అటు టిబెటన్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  140 కోట్ల భారతీయుల తరఫున తాను దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. దలైలామా ప్రేమ, కరుణ, సహనం, నైతిక క్రమశిక్షణకు మారుపేరుగా అభివర్ణించారు. ఆయన దీర్ఘాయువు కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోడీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

Read Also: అమర్ నాథ్ యాత్ర ప్రారంభం, భారీ భద్రత ఏర్పాటు!

Back to top button