తెలంగాణ

మరో నాలుగు రోజులు.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు!

Heavy Rains in Telangana: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అన్ని జిల్లాల్లోనూ కుండపోత వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం  నుంచి ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఈ ఏడాదిలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ లో 12.9 సెంటీ మీటర్లు కురిసింది. సికింద్రాబాద్‌ పరిధి మారేడుపల్లిలోని పికెట్‌ ప్రాంతంలో  11.5 సెం.మీ నమోదైంది.  మేడ్చల్‌- మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, జనగామ, పెద్దపల్లి, మెదక్, యాదాద్రి, సిద్దిపేట, నిర్మల్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. హైదరాబాద్ లో రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది. గంటల తరబడి వాహనదారులు, ప్రయాణీకులు రోడ్ల మీద అవస్థలు పడ్డారు.

నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. దక్షిణ కోస్తా.. దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. ఇవాళ, రేపు (19, 20 తేదీల్లో) సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌- మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ భారీగా వర్షాలు పడుతాయని వెల్లడించింది. అటు 20, 21 తేదీల్లో సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌- మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌  జిల్లాలతో పాటు ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, వనపర్తి, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, ఖమ్మం, జయశంకర్‌ జిల్లాల్లో వానలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.  ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని సూచించారు.

Read Also: హైదరాబాద్ లోకుండపోత, జనజీవనం అస్తవ్యవస్థం!

Back to top button