
క్రైమ్ మిర్రర్, Investigation Bureau : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కావాలా… మేమిస్తాం రండి. ట్రైనింగ్ ఇచ్చి.. పోస్టింగ్ కూడా ఇప్పిస్తాం. మా దగ్గర చేరితే.. మీ భవిష్యత్ బంగారుమయమే… అంటూ ఊదరగొట్టారు. ఊరించారు. అంతేనా… ఇంట్లో ఉండే ఉద్యోగం చేసుకోవచ్చు. ఆఫీసుకు వెళ్లాల్సిన పని కూడా లేదు. అంతా వర్క్‌ఫ్రమ్ హోం. ఈ మాటలు చాలా మంది నమ్మారు. ఒక్కొక్కరూ రెండు లక్షల రూపాయలు వరకు సమర్పించుకున్నారు. ఇప్పుడు ఆ కంపెనీ బోర్డు తిప్పేయడంతో.. తూర్పు తిరిగి దండం పెడుతున్నారు. ఎక్కడో కాదు… హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిందీ దందా.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే యువతకు మక్కువ. లగ్జరీ ఉద్యోగం… ఐదంకెల జీతం.. ఎవరు కోరుకోరు. అందుకే సాఫ్ట్‌వేర్ జాబ్‌కు పోటీ ఎక్కువ. యువతలో ఉన్న ఈ ఆశను క్యాష్ చేసుకుంటున్నారు కొందరు కేటుగేళ్ల. ఆమాయకులు దొరక్కపోరు.. దోచుకునే మార్గం రాకపోదు… అనుకుని… బోగస్ కంపెనీలు పెడుతున్నారు. అలాంటి వారి మాయలో చాలా మంది పడుతున్నారు. ఆ కంపెనీ ఎప్పుడు పెట్టారు..? దాని హిస్టరీ ఏంటి..? ప్లేస్‌మెంట్ రికార్డ్ ఏంటి..? ఇలా అన్నీ ఎంక్వైరీ చేసుకోవాలి. కానీ.. అలా ఎంతమంది చేస్తున్నారు. మోసపూరిత మాటల వలలో పడిపోతున్నారు. ఉన్నవి అమ్మి… అప్పులు చేసి… డబ్బులు కట్టేస్తున్నారు. అవన్నీ మూటగట్టుకుని ఎంచక్కా చెక్కేస్తున్నాయి బోగస్ కంపెనీలు.
హైదరాబాద్ గచ్చిబౌలిలో కూడా ఇదే జరిగింది. సాఫ్టవేర్ ఉద్యోగాల పేరుతో మాయచేసిన కంపెనీ బోర్డు తిప్పేసింది. తమ వద్ద శిక్షణ తీసుకుంటే… జాబ్స్ కూడా ఇప్పిస్తామని నమ్మించి గొంతుకోసింది ప్యూరోపేల్ క్రియేషన్ అండ్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని… నయవంచన చేసింది. ట్రైనింగ్ పూర్తయినా ఆఫర్ లెటర్లు రాకపోవడంతో.. డబ్బు కట్టిన వాళ్లంగా కంపెనీ దగ్గరకు వెళ్లారు. అక్కడ కంపెనీ లేకపోవడం అవాక్కయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీ బాధితుల లిస్ట్‌లో 200 మంది ఉన్నారు. లక్షల రూపాయల డబ్బులు పోగొట్టుకున్నామని లబోదిబోమంటున్నారు. మోసపోయేవాళ్లు ఉన్నంత కాలం… మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. మనమే జాగ్రత్త ఉండాలి. సో.. తస్మాత్ జాగ్రత్త.