క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట నిఘా : బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్

రామకృష్ణపూర్,క్రైమ్ మిర్రర్:- ఈ నెల 11న జరగనున్న క్యాతనపల్లి మున్సిపాలిటీ రెండో సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసిందని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు. సోమవారం రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించి, భద్రతా చర్యలు, విధి నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మున్సిపాలిటీలోని 22 వార్డులకు గాను 14 ప్రాంతాల్లోని మొత్తం 45 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటిలో నాలుగు పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి, అక్కడ అదనపు పోలీస్ బలగాలను మోహరించినట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో సుమారు 150 మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ నిర్వహించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.ఎన్నికల ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు తక్షణమే క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిని విడిచి వెళ్లాలని ఆదేశించారు.

నిఘా నేత్రాల నీడలో పోలింగ్.. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోండి

నిబంధనలు అతిక్రమించి ప్రచారం నిర్వహించినా, ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేసినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారం చేయరాదని, 200 మీటర్ల అవతల ఓటర్లకు స్లిప్పులు ఇవ్వడానికి కేవలం ఒక టేబుల్, రెండు కుర్చీలకే అనుమతి ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు ఏర్పాటు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదన్నారు.ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, ప్రలోభాలకు లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏసీపీ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం మొబైల్ టీమ్స్, సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, ఇన్‌ఛార్జ్ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో మందమర్రి సీఐ రమేష్‌తో పాటు సర్కిల్ పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు.

రేపు ఓటీటీలోకి రెండు సూపర్ హిట్ మూవీస్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button