
క్రైమ్ మిర్రర్, గుంటూరు: గుంటూరు జిల్లాలోని పరివర్తన భవన్ ఎస్సీ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌లో విద్యార్థినుల భద్రత, నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం నిర్వహించిన రొటీన్ బ్యాగ్ చెకింగ్ సమయంలో ఒక విద్యార్థిని బ్యాగ్‌లో ప్రెగ్నెన్సీ కిట్, మంగళసూత్రం, మెట్టెలు బయటపడటం హాస్టల్ సిబ్బందిని కూడా షాక్‌కు గురిచేసింది. మొదట ఈ విషయాన్ని వార్డెన్ దృష్టికి తీసుకెళ్లగా, ఆమె వెల్ఫేర్ శాఖ అధికారులకు సమాచారమిచ్చింది. అయితే ఈ సంఘటనను బయటకు రాకుండా అధికారులు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఈ విషయం సోషల్ మీడియాలో చర్చగా మారడంతో బుధవారం రాత్రి సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ లావణ్యవేణి స్వయంగా హాస్టల్‌కు చేరుకుని ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితి చూసి ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గదులు శుభ్రం లేకుండా, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, విద్యార్థినుల భద్రతను పట్టించుకోకపోవడం ఆమెను తీవ్ర అసహనానికి గురిచేసింది. దాదాపు రెండు గంటలపాటు ప్రతి గదిని స్వయంగా తనిఖీ చేసి, హాస్టల్ నిర్వహణ పూర్తిగా అపరిశుభ్రంగా వదిలేయబడిందని వ్యాఖ్యానించారు.
ముగ్గురు వార్డెన్లు ఉన్నప్పటికీ ఇలా హాస్టల్‌ను నిర్లక్ష్యంగా నడపటం ఏం అర్ధమని ప్రశ్నించిన ఆమె, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారం రోజుల్లో మళ్లీ తనిఖీ చేస్తానని స్పష్టంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే సమయంలో విద్యార్థిని బ్యాగ్‌లో దొరికిన ప్రెగ్నెన్సీ కిట్ వ్యవహారంపై ఎఎస్డబ్ల్యూఓ శైలజను వివరణ కోరినప్పటికీ, తాము ఎలాంటి ఫిర్యాదు పొందలేదని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులైన హాస్టల్ వార్డెన్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డీడీకి ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
పరివర్తన భవన్ హాస్టల్‌పై గతం నుంచే వివాదాలు, భద్రత లోపాలు ఉంటూ వచ్చాయి. నెలరోజుల క్రితం ఇదే హాస్టల్‌కు చెందిన ఓ విద్యార్థినిని ఒక ఆకతాయి హైదరాబాదుకు తీసుకెళ్లడంతో పోలీసులు మూడు రోజులు శ్రమించి తిరిగి ఆమెను హాస్టల్‌కు అప్పగించిన ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఆ సంఘటనపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహంతో హాస్టల్ అధికారులను ప్రశ్నించిన విషయం ఇంకా మరువక ముందే, ఇప్పుడు మరో విషయం బయటపడటం హాస్టల్ నిర్వహణలో ఉన్న లోపాలను బహిర్గతం చేస్తోంది.
ఇక గత ఏడాది డిసెంబర్‌లో ఇదే హాస్టల్‌లో ఓ విద్యార్థిని ప్రసవించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో వార్డెన్‌ను సస్పెండ్ చేసి విచారణ జరిపినప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. వరుస ఘటనలు హాస్టల్‌ను నడిపే పాలకుల నిర్లక్ష్యం, పర్యవేక్షణలో ఉన్న లోపాలను స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
ALSO READ: అన్నపూర్ణా దేవి శివుడికి ఎందుకు భిక్షం వేస్తుందో తెలుసా?





