మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:- గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు, వలసల నివారణకు వెన్నెముకగా నిలుస్తున్న, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరును, యరుగండ్లపల్లి గ్రామ సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ గురువారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. గ్రామంలో సాగుతున్న వివిధ పనులను పరిశీలించిన ఆయన, కూలీల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
క్షేత్రస్థాయి పరిశీలన – కూలీలతో ముఖాముఖి
పనుల నాణ్యతను, కొలతలను పరిశీలించిన అనంతరం, సర్పంచ్ సంతోష్ యాదవ్ కూలీలతో నేరుగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రజల ఆర్థిక స్వావలంబన కోసం, ఈ పథకాన్ని ప్రవేశపెట్టాయని గుర్తుచేశారు.. ప్రతి పేదవాడికి పని హక్కు కల్పించడమే ఈ పథకం లక్ష్యమని, దీనిని సద్వినియోగం చేసుకుని గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
సమస్యల గుర్తింపు..తక్షణ ఆదేశాలు
పని ప్రదేశంలో కూలీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా, పని ప్రదేశాల్లో చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యం నిరంతరం అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. ప్రమాదవశాత్తు ఏవైనా చిన్నపాటి గాయాలైతే తక్షణ చికిత్స కోసం మెడికల్ కిట్లను సిద్ధంగా ఉంచాలన్నారు. పని చేసిన ప్రతి కూలీకి నిర్ణీత సమయంలోగా వేతనాలు జమ అయ్యేలా చూడాలని, మస్టర్ల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లు జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. కూలీల కష్టానికి తగిన ప్రతిఫలం సకాలంలో అందడమే ప్రాధాన్యతని, దానికై అధికారులు కృషి చెయ్యాలని చెప్పారు.
పనుల రిజిస్ట్రేషన్, కొలతల నమోదు సక్రమంగా జరుగుతున్నాయా అని రికార్డులను తనిఖీ చేశారు. పని ప్రదేశంలో కూలీలకు అవసరమైన అన్ని వసతులను, కల్పించే బాధ్యత అధికారులు తీసుకోవాలన్నారు.
ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూలీలకు, ఏవైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని సర్పంచ్ సంతోష్ యాదవ్ ఈ సందర్బంగా సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రవణ్, ఫీల్డ్ అసిస్టెంట్ వల్లంల శ్రీశైలం, ముత్తు పాల్గొన్నారు
