జాతీయం

చలాన్ చెల్లించేందుకు జనాల పరుగులు.. ఎందుకో తెలుసా?

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్ తప్పదన్న విషయం అందరికీ తెలిసినదే. అయినా దేశవ్యాప్తంగా చాలా మంది వాహనదారులు చలాన్‌ను పెద్దగా పట్టించుకోరు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్ తప్పదన్న విషయం అందరికీ తెలిసినదే. అయినా దేశవ్యాప్తంగా చాలా మంది వాహనదారులు చలాన్‌ను పెద్దగా పట్టించుకోరు. నిబంధనలు ఉల్లంఘించినా సరే, ఎప్పుడో ఒకసారి ప్రభుత్వం డిస్కౌంట్ ఇస్తే అప్పుడే చెల్లిద్దామని అనుకునే ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే చలాన్ అనేది తమకు సంబంధం లేని అంశంగా భావించే పరిస్థితులు చాలాచోట్ల కనిపిస్తుంటాయి. చలాన్ చెల్లించడం అవమానంగా భావించే మానసికత్వం కూడా కొందరిలో ఉంది. అయితే ఈ సాధారణ ధోరణికి పూర్తిగా భిన్నమైన దృశ్యం ఇప్పుడు మహారాష్ట్రలో కనిపిస్తోంది.

మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ట్రాఫిక్ చలాన్లపై ఒక్కసారిగా దృష్టి కేంద్రీకృతమైంది. వాహనదారులు స్వచ్ఛందంగా ట్రాఫిక్ పోలీస్ కార్యాలయాలకు వచ్చి క్యూ లైన్లలో నిల్చొని పెండింగ్‌లో ఉన్న ఈ-చలాన్లను చెల్లిస్తున్నారు. వేల రూపాయలకే కాదు.. లక్ష రూపాయలకు మించిన మొత్తాలను కూడా ఒక్కసారిగా చెల్లిస్తున్న ఘటనలు అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ అకస్మాత్తు మార్పుకు కారణం ఎన్నికల సంఘం తీసుకున్న కీలక నిర్ణయమే.

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులపై ఎలాంటి ప్రభుత్వ బకాయిలు ఉండకూడదని ఎన్నికల సంఘం స్పష్టమైన నిబంధనలు తీసుకొచ్చింది. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు, పన్నుల బకాయిలు, అనధికార నిర్మాణాలకు సంబంధించిన జరిమానాలు వంటి అన్ని ప్రభుత్వ బకాయిలను పూర్తిగా చెల్లించాల్సిందేనని ఆదేశించింది. ఈ నిబంధనను పాటించని అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశముందని స్పష్టం చేసింది.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ వాహనాలపై ఉన్న ఈ-చలాన్లను పూర్తిగా చెల్లించారో లేదో ఎన్నికల అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అభ్యంతరాల నిరాకరణ పత్రం, అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుంటే నామినేషన్ ఫారాలు అనర్హతకు గురయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో అభ్యర్థులు తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి చలాన్ల చెల్లింపుపై తీవ్రంగా దృష్టి పెట్టారు.

గత కొన్ని రోజులుగా థానే ట్రాఫిక్ విభాగం కార్యాలయాల్లో అభ్యర్థుల రద్దీ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. నామినేషన్లపై ఎలాంటి సమస్యలు తలెత్తకూడదన్న ఉద్దేశంతో చాలా మంది అభ్యర్థులు తమ వాహనాలపై పెండింగ్‌లో ఉన్న ఈ-చలాన్లను వెంటనే చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఒక్కరోజే ఓ అభ్యర్థి తన నామినేషన్ భద్రత కోసం రూ.1.5 లక్షలకు పైగా ట్రాఫిక్ జరిమానాలను చెల్లించిన ఘటన చర్చనీయాంశంగా మారింది.

ఈ-చలాన్ వ్యవస్థ ద్వారా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై విధించే జరిమానాలను ఆన్‌లైన్‌లో సులభంగా చెల్లించే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు చట్టపరమైన బాధ్యతలను ఎంతవరకు పాటిస్తున్నారన్నదానికి ఇది ఒక కొలమానంగా మారిందని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈ కఠిన నిబంధన వల్ల ప్రజాప్రతినిధులపై చట్టపరమైన బాధ్యత మరింత పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అభ్యర్థుల రద్దీ నేపథ్యంలో ఠాణె ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఈ-చలాన్ల చెల్లింపునకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు, ఆన్‌లైన్ పేమెంట్ సౌకర్యాన్ని మరింత సులభతరం చేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని డీసీపీ పంకజ్ శిరసాట్ తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలతో ట్రాఫిక్ చలాన్ వ్యవస్థపై ప్రజల్లో అవగాహన పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.

ALSO READ: హాట్ కేక్ లాంటి iQube.. ఏకంగా 100కు పైగా ఫీచర్లు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button