న్యూఢిల్లీ, క్రైమ్ మిర్రర్ః భారత్‌కు గుడ్ న్యూస్ ఏడేళ్ల తరువాత ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోల్లు పునః ప్రారంభమయ్యాయి. అమెరికా ఆంక్షల కారణంగా 2019లో నిలిపివేసిన ఇరాన్ చమురు దిగుమతులను భారత్ సుమారు 7 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రారంభించింది. ఇరాన్ నుండి దిగుమతి చేసుకుంటున్న చమురుకు సంబంధించి “చెల్లింపు సమస్యలు ఉన్నాయనే వార్తలను భారత కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.
చెల్లింపుల్లో ఎలాంటి అడ్డంకులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక ఇరాన్ చమురు ట్యాంకర్ భారత్‌కు రావాల్సి ఉండగా, చెల్లింపుల సమస్య వల్ల చైనాకు మళ్లించారనే ప్రచారాన్ని ప్రభుత్వం కొట్టిపారేసింది. అంతర్జాతీయ చమురు వ్యాపారంలో నౌకల గమ్యస్థానాలు మారడం సాధారణమని, అది వాణిజ్యపరమైన నిర్ణయమే తప్ప చెల్లింపుల సమస్య కాదని వివరించింది.
చమురుతో మంగుళూరుకు చేరుకున్న’సీ బర్డ్’నౌక…
పశ్చిమ ఆసియాలో (ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు) యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో, భారత్ తన ఇంధన అవసరాల కోసం వివిధ దేశాలపై ఆధారపడుతోంది. ప్రస్తుతం భారత్ 40 కంటే ఎక్కువ దేశాల నుండి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. అమెరికా మినహాయింపు: ఇటీవల వాషింగ్టన్ ఇరాన్ చమురు విక్రయాలపై కొంత కాలం పాటు (30 రోజులు) ఆంక్షల నుండి మినహాయింపు ఇవ్వడంతో ఈ దిగుమతులు సాధ్యమయ్యాయి.
కేవలం ముడి చమురు మాత్రమే కాకుండా, సుమారు 44,000 మెట్రిక్ టన్నుల ఇరాన్ ఎల్‌పీజీ మోసుకెళ్తున్న ‘సీ బర్డ్’ నౌక ఇప్పటికే మంగళూరు పోర్టుకు చేరుకుంది. భారత రిఫైనరీలు తమకు కావలసిన ముడి చమురును ఇరాన్ సహా ఇతర ప్రాంతాల నుండి విజయవంతంగా సేకరించాయని, రాబోయే నెలల్లో దేశంలో ఇంధన సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
