
క్రైమ్ మిర్రర్, ఇన్వెస్టిగేషన్ నల్లగొండ బ్యూరో: నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి, ఒకప్పుడు ప్రజలకు ఆశాజ్యోతి లాగా నిలిచిన ఈ వైద్య సంస్థ, ఇప్పుడు నిర్లక్ష్యం, అధికార ధోరణి, బాధ్యతారాహిత్యం అనే మూడుసూళ్ల త్రిపుటలో చిక్కుకుపోయింది. ఈసారి ఈ నిర్లక్ష్యం కారణంగా ప్రాణం కోల్పోయింది ఒక నిరపరాధ పసికందు. గుర్రంపోడు మండలానికి చెందిన కడమంచి మహేష్ భార్య రేణుక మంగళవారం ఉదయం డెలివరీ నొప్పులతో ఆసుపత్రికి వచ్చింది. ఆమె పరిస్థితి గమనించిన వైద్యులు ప్రాథమిక పరీక్షల తరువాత బేబీ బాగుంది, వారం తరువాత రావచ్చు అంటూ నిర్లక్ష్యంగా తిరిగి పంపారు.
ఆమె బయటికి వెళ్లి కొంతసేపటికి మళ్లీ నొప్పులతో విలవిల్లాడుతూ ఆసుపత్రికి చేరుకుంది. తిరిగి పరీక్ష చేసిన అదే వైద్యులు ఈసారి బిడ్డ రెండు రోజుల క్రితమే గర్భంలో చనిపోయిందని ప్రకటించారు. ఇదే వైద్యులు కేవలం గంటల ముందు బేబీ బాగుందని చెప్పడం ఆ మాటల్లో వైద్య విజ్ఞానం లేదు, నిర్లక్ష్య ధోరణి మాత్రమే ఉందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఆపరేషన్ చేసి మృత బాబును బయటకు తీశారు. ఆ దృశ్యం చూసిన తల్లి, కుటుంబం, అక్కడ ఉన్న ప్రజలు ఒక్కసారిగా కుదేలయ్యారు. ఇది వైద్యం కాదు, వైద్య హత్య..! అంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి కన్నీళ్లతో, బిడ్డను చూడలేకపోయిన తండ్రి రోదనతో ఆసుపత్రి ప్రాంగణం కదిలిపోయింది. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించారు.
Read More : స్థానిక సంస్థల ఎన్నికలపై స్టేకు హైకోర్టు నిరాకరణ
క్రైమ్ మిర్రర్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ ఘటన వెనుక కేవలం ఒక అపశ్రుతి కాదు, వ్యవస్థపరమైన వైఫల్యం ఉంది. ఆసుపత్రిలో ఆ రోజు ఒకే ఒక్క గైనకాలజిస్టు డ్యూటీలో ఉన్నారు. స్కానింగ్ పరికరం.. సరిగా పనిచేయకపోవడం, ఫీటల్ హార్ట్ మానిటరింగ్ సిస్టమ్ అందుబాటులో లేకపోవడం, పరీక్షలను సదుపాయాల లేమితో వాయిదా వేయడం వంటి కారణాలు ఈ ఘటనకు దారితీశాయి. ఈ అంశాలు వైద్య సిబ్బంది అందరికీ తెలిసిందే అయినా, ఏ ఒక్కరూ వాటిని సరిదిద్దడానికి ముందుకు రాలేదు. ఈ ఘటనలో ప్రధాన ప్రశ్న ఒక గర్భిణి తన ప్రాణం కోసం వేడుకుంటూ ఆసుపత్రి సిబ్బంది ముందు నిలబడినా, ఎవరూ ఆమెను పట్టించుకోలేదు ఎందుకు? ఒక మహిళ కడుపులో బిడ్డ చనిపోయిన తరువాత మాత్రమే వైద్య వ్యవస్థ మేల్కొనడం అంటే మన ఆరోగ్య వ్యవస్థ ఎటు దారి తీస్తోంది?
ప్రభుత్వ ఆసుపత్రులలో నిత్యం మనం చూస్తున్నదే, రోగి కంటే ఫైల్ ముఖ్యమైపోవడం. నొప్పితో విలవిల్లాడుతున్న తల్లిని పరీక్షించే ముందు సిబ్బంది సైన్ చేయండి, రిపోర్ట్ తీసుకురండి, డాక్టర్ బిజీగా ఉన్నారు, అంటూ ప్రాణం కన్నా కాగితం ముఖ్యం చేసేస్తున్నారు. ఇదే రేణుకకు కూడా ఎదురైంది. ఇలాంటి సంఘటనలు తరచూ పునరావృతం కావడానికి ప్రధాన కారణం భయంలేని వ్యవస్థ. ఎవరూ బాధ్యత వహించరు, ఎవరినీ సస్పెండ్ చేయరు. కేసు నమోదు అయినా, విచారణలు నెలలతరబడి పడుతుంది. చివరికి ఫలితం శూన్యం. ప్రాణం పోయినా, నివేదికలు మాత్రం సాధారణ వైద్య కారణం అని చెబుతారు.
ఈ సంఘటన ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ప్రైవేట్ ఆసుపత్రిలో డబ్బు లేక చస్తాం, ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంతో చస్తాం… మధ్యలో మాకు ఆశ ఎక్కడ.? అని ఒక వృద్ధుడు ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నలో ఉన్న వేదనే ప్రజా వైద్య వ్యవస్థ యొక్క దుస్థితికి అద్దం పడుతుంది. ఈ ఘటన కేవలం ఒక కుటుంబం దుఃఖం కాదు, ఒక సమాజం వైద్య వ్యవస్థపై నమ్మకం కోల్పోయిన సంకేతం. ఈ సంఘటనపై పూర్తి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవడం తప్ప ప్రభుత్వం వద్ద మరే మార్గం లేదు. లేదంటే రేపు మరొక పసికందు ఇదే విధంగా ప్రాణాలు కోల్పోతారు. ప్రజా ఆసుపత్రులు ప్రాణ రక్షణ కేంద్రాలు కావాలి, ప్రాణాంతక స్థలాలు కాదు. ఈ సత్యం అధికారులకు ఎప్పుడు అర్థమవుతుందో, అప్పటి వరకు ప్రతి బిడ్డ మరణం ఈ వ్యవస్థకు మోసపోయిన ఒక నిర్భాగ్య గాధగానే మిగిలిపోతుంది.
– క్రైమ్ మిర్రర్ ఇన్వెస్టిగేషన్ టీమ్, నల్లగొండ