
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్):-
మర్రిగూడ:- పూర్వము పెద్ద లింగంపల్లి అనబడే ఊరు కలదు, ఇట్టి గ్రామం కరువు వలన ప్రజలందరూ వలసవెల్లి, ఒక పెద్ద మర్రిచెట్టు దగ్గర నివాసం ఏర్పర్చుకున్నారు. రానురానూ ఈ ప్రాంతాన్ని మర్రిగూడగా నామకరణం జరిగిందట..కానీ ఇప్పుడు ఆ మర్రిచెట్లు లేకపోవడం దురదృష్టకరం.
కొండూర్:- మొదటగా ఇట్టి గ్రామాన్ని గ్రద్ద కొండూర్ గా పిలిచేవారట.. ఈ గ్రామంలో కొండలు(గుట్టలు) గ్రద్ద ఆకారంలో, చాలా పెద్దగా వుంటుంది కాబట్టి..ఇట్టి ప్రాంతాన్ని గ్రద్ద కొండూర్ గా పిలిచేవారట, రానురానూ గ్రద్ద తొలగించి కొండూర్ గా నామకరణం జరిగిందట. ఈ ప్రాంతం రాచకొండ, దేవరకొండ రాజుల పరిపాలనలో తన ఉనికిని చాటుకుందట, ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని రాజుల రాక పోకల సందర్భంలో, సమాచార పంపిణీ అవసరాలకోసం ఉపయోగించుకునే వారట, ఇక్కడ ఉప్పోని చెలక, కొమ్మోని మాన్యం, గుర్రాల కుంట, శాస్త్రాలవారి చెలక అనబడే పట్టాలు వుండేవట.
సరంపేట:- ఈ ప్రాంతంలో సరమ్మ అని పిలువబడే ఒకరి పేరున.. ఈ గ్రామాన్ని సారంపేటగా నామకరణం జరిగిందట.. ఈ ప్రాంతంలో చెన్నకేశ్వర స్వామి, స్తంబాద్రి లక్ష్మి నర్సింహా స్వామి దేవాలయాలకు ప్రసిద్ది.. ఆ నాటి నుండి ఈరోజు వరకు ప్రతి సంవత్సరం సరంపేట పేరిట పెద్ద జాతర జరుగుతుంది.
వట్టిపల్లి:- ఈ ప్రాంతానికి నామం రెండు రకాలుగా ప్రాచుర్యం జరుగుతుంది, వట్టి అనగా జైనుల కాలంలో గుడి అని అర్ధం, ఇక్కడ గుట్ట మీద ఒక గుడి వుండడం వలన, వట్టిపల్లిగా నామకారణం జరిగిందని ప్రాచుర్యం జరుగుతుంది.. వేరొకటి ఈ ప్రాంతంలో ఎటువంటి పంటలు పండక నీటి వసతి లేనందున ”ఒట్టి” గ్రామంగా పిలువబడి రాను రాను వట్టిపల్లిగా పేరొందిందని అంటున్నారు.
దామెర భీమనపల్లి:- దామెర అనగా తాడు లాంటిది, రెండు గుంజలకు తాడు కట్టి పశువులను కట్టేసేవారు, చుట్టూ ప్రక్కల ప్రాంతాలలోని పశువులను ఒక దగ్గర కట్టేసేవారు.. దీనిని దామెరలో కట్టేసిన అనే వారట.. దీనికి దగ్గరలో భీమయ్య అనే వ్యక్తి పేరున, కట్టిన ఊరుకావడం వలన దామెర భీమనపల్లిగా నామకరణం జరిగిందట.
బట్లపల్లి:- చుట్టూ ప్రక్కల మొత్తం గుట్టలు వుండడం వలన గుట్లపల్లి అని పిలిచేవారట.. రానురాను ఈ పేరు బట్లపల్లిగా నామకరణం జరిగిందట.
ఖుధాబక్షిపల్లి:- రాచకొండ రాజుల కాలంలో ఈ ప్రాంతం పక్కన తుమ్మలగూడెం వుండేదట.. దీని పైన కండెలరాయిని అనే చెరువు వుంది.. ఇది తెగినపుడు తుమ్మలగూడెం నాశనం అయిందట. “దీనిని వదిలి ప్రజలు శివారులోని విస్తారంగా నీటి వసతి వున్న ‘మన్నేవారి పర్రె’ కాలువ వెళ్ళే ప్రాంతంలో నివశించేవారట.. ఇక్కడ ప్రాంతం సస్యశ్యామలంగా, అడవి ప్రాంతం, ప్రకృతి పరంగ ఆహ్లాదకరంగా వుండేదట. వీరి తర్వాత నైజాం రాజుల కాలంలో ఈ ప్రాంతంలో మీర్జా మొయిన్ బైగ్ యొక్క పూర్వీకులు, జాగీర్దారులు వుండేవారట. ఒకరికి తనక జాగీరుగా ఈ ప్రాంతాన్ని నైజాం రాజులు తనకా జాగీరు కింద ఇచ్చినారు. దీనిని ఆ జాగీర్దారు “ఖుధా భాక్ష్” (భగవంతుని ఇచ్చిన దానం)గా భావించి ఈ ప్రాంతాన్ని ”ఖుధా భాక్ష్” గా పిలిచేవారట.. రానురాను అది ఖుధాబక్షిపల్లిగా నామకరణం జరిగింది.
యెరగండ్లపల్లి:- ఈ ప్రాంతంలో ఏడుగండ్లు మద్యన ఉన్నందున ఏడుగండ్లపల్లిగా పిలువబడేదట.. గండ్లు అనగా రెండు గుట్టల మద్యన వున్న ప్రాంతం.. గండ్ల పేర్లు లోకగండి, మర్రిగూడెం గండి, కొండూరుగండి, భుగ్గ గండి, తిరుగండి, తక్కలపల్లిగండి, మల్లేపల్లి గండి, రానురాను ఈ ఏడుగండ్లపల్లిని ” యెరగండ్లపల్లి” గా పిలువబడిందట. ఇక్కడ విస్తారంగా నీటి వసతి కలదు. గుట్టల మద్యన “బుగ్గ నుండి నిరంతరం జలం పారేదట. ఈ బుగ్గ నుండి వచ్చేనీరుతో పశుపోషణ, వ్యవసాయంలో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా వుండేదట. ఈ బుగ్గ ప్రక్కన ఎప్పుడూ జలం వుండడం వలన.. “అ జలా పురం ” అనె గూడెం కలదు. ఇప్పటికీ కూడా ఈ బుగ్గ ప్రాంతం తడిగానే వుంటుంది.
వెంకేపల్లి:- అజలాపురం లోని గుట్టల మద్యన ” బుగ్గ” నిరంతరం జలం వచ్చే ప్రాంతం వెనుక ఈ గ్రామం వుంటుంది. బుగ్గ నీరుపారుతున్న వెనుక వున్న ఈ ప్రాంతానికి ”వెనెక పల్లె”గా పిలిచేవారట. రానురాను ఇది వెలగా పల్లి, ఇప్పుడు వెంకేపల్లిగా పిలువబడుతుంది.
తమ్మడపల్లి:- ఈ ప్రాంతంలో ‘తమ్మల్ల” అనే వర్గం వారు పూజారి వృత్తి చేసేవారట.. వీరు ఈ ప్రాంతంలో ఎక్కువగా వుండడం వలన తమ్మడపల్లిగా నామకరణం జరిగిందని ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం ఈ వర్గానికి చెందినవారు ఈ గ్రామంలో ఎవరు లేకపోవడం గమనార్హం.
తిరుగండ్లపల్లి:- ఇక్కడ చిన్నచిన్న గుండ్లు ఎక్కువగా వుంటాయి. ఆ కాలంలో ఎక్కడ చూసిన గుండ్లు వుండడం వలన ఎక్కడ తిరిగిన గుండ్లు వుండడం వలన “తిరుగుడు గుండ్లు” గా పిలిచేవారట. రానురాను తిరుగుడు గుండ్లు తిరుగండ్లపల్లిగా నామకరణం జరిగిందట.
సోమరాజుగుడ:- దేవరకొండ రాజుల కాలంలో ” సోమ” రాజు అనబడే వ్యక్తి ఈ ప్రాంతాన్ని పరిపాలిచాడట.. తద్వారా ఈ ప్రాంతాన్ని ”సోమరాజు గూడెం” గా నామ కారణం జరిగిందట.
అంతంపేట:- దేవరకొండ రాజుల కాలంలో ” సోమ” రాజు అనబడే వ్యక్తి ఈ ప్రాంతాన్ని పరిపాలిచాడట. వీరి బార్య అంతమ్మ దొరసాని దీని ప్రక్కన, ఒక ప్రాంతంలో పునాది పోసి ఇండ్లు కట్టిందట, దీని వలన ఈ ప్రాంతాన్ని “అంతంపేట”గా నామకరణం జరిగిందట.
నామాపురం:- దేవరకొండ సంస్థానంలో రెడ్డి రాజులు ఇట్టి ప్రాంతాన్ని పరిపాలించాడట. ఆయన పరిపాలనలో మొత్తం వైష్ణ, వైష్ణవ మతానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చి, గ్రామ ప్రజలందరూ కూడా నామాలు (నిలువు బొట్లు) పెట్టుకునే వారట, అందువలన ఈ గ్రామాన్ని మొదటగా నామాలపురంగా పిలిచేవారట. రానురాను నామాపురంగా పిలవబడుతుంది.
ఇందుర్తి:- రాచకొండ రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారట. ఆకాలంలో దీనిని ” ఇంద్రాలపట్నంగా పిలిచేవారట. రానురాను ఈ ఇంద్రాలపట్నం “ఇందుర్తి గా మారిందని ప్రాచుర్యం పొందింది. ఇందుర్తి చుట్టుప్రక్కన శివన్నగూడ, టానేదారుపల్లి, రాంరెడ్డిపల్లి, నర్సిరెడ్డిగూడెం, చెర్లగూడెం చిన్నచిన్న గ్రామాలు కలవు. ఇక్కడ ప్రాచీన శివాలయాలు ఎక్కువగా వున్నాయి. ఈ ఇంద్రాలపట్నంలో ఉత్సవాలు ఎక్కువగా జరిగేవట. సరంపేట జాతర, చెర్లగూడెం జాతర, యెరగండ్లపల్లి జాతర ఉత్సవ విగ్రహాలన్నీ “టానేదారు” పల్లిలో బద్రపరిచేవారట, ఈ ఇంద్రాలపట్నంలో దాదాపుగా 100 బ్రాహ్మణ కుటుంబాల వారు నివశించేవారట. ఈ గ్రామంలో దేవాలయ భూములు ఎక్కువ. ఇప్పుడు కూడ అక్కడక్కడ పొలాలలో శివలింగాలు, గణేశ్ విగ్రహాలు కనిపిస్తాయి.
మేటి చందాపురం:- రాచకొండ రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారట. ఆకాలంలో దీనిని ” ఇంద్రాలపట్నం” గా పిలువబడే ఇందుర్తి, గ్రామ చుట్టూ ప్రక్కల గ్రామాలలో “మేటి”(పెద్ద)బాగానికి ఒక పేరు పెట్టుకొని “మేటిచందాపురం”గా పిలిచేవారట.
లెంకలపల్లి:- ఈ ప్రాంతం మొత్తం లెంక లెంకల్లు” (లెంకే పెట్టినట్లు)గా వుంటుంది. ఈ గ్రామ నక్షా కూడా లెంకే పెట్టినట్లు, చిన్న చిన్న భాగాలుగా వుంటుంది. కావున ఈ ప్రాంతానికి లెంకలపల్లిగా నామకరణం జరిగిందని ప్రాచుర్యం పొందింది.ప్రస్తుతం మర్రిగూడ తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాస్, 12 సంవత్సరాల క్రితం, సంబంధిత విశ్లేషణల ఆధారంగా, అప్పటి జిల్లా కలెక్టర్ ముక్తేశ్వర్ రావు సహకారంతో తయారు చేసిన, ఈ వివరాలు మండల వ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి..





