Bigg Boss 9 Telugu Winner Kalyan Padala: బిగ్‌బాస్ సీజన్-9 తెలుగు విన్నర్ గా కామనర్ కల్యాణ్ పడాల నిలిచారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ సీజన్‌లో ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సాధించిన కల్యాణ్ విజయం సాధించినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. బిగ్‌బాస్ ఇచ్చిన రూ.20లక్షల గోల్డెన్ బ్రీఫ్ కేసును కూడా వద్దనుకుని చివరి వరకూ విజయంపై నమ్మకంతో నిలబడ్డాడు. ఆ నమ్మకమే కల్యాణ్‌ను విజేతని చేయడమే కాదు. రూ.35లక్షల ప్రైజ్ మనీతో పాటు, ట్రోఫీని అందుకునేలా చేసింది. రెండో స్థానంలో తనుజ నిలువగా, మూడో స్థానంలో డిమాన్ పవన్, నాలుగో స్థానంలో ఇమ్మాన్యుయేల్, ఐదో స్థానంలో సంజన నిలిచారు. డిమాన్ పవన్ రూ. 15 లక్షల బ్రీఫ్ కేసుతో బయటకు వచ్చాడు.
కామనర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి..
ఈసారి బిగ్‌బాస్‌కు ముందు నిర్వాహకులు పెట్టిన అగ్ని పరీక్షలో ఒక కామన్‌మ్యాన్‌గా కల్యాణ్ పడాల పోటీ పడ్డారు. అక్కడ కూడా ప్రేక్షకుల మనసులు గెలుచుకొని హౌస్‌లోకి అడుగు పెట్టాడు. సీఆర్పీఎఫ్ జవాన్ అయిన కల్యాణ్‌కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. బిగ్‌బాస్ సీజన్9 సందర్భంగా నిర్వహిస్తున్న అగ్నిపరీక్ష గురించి తెలిసి దరఖాస్తు చేసుకున్నాడు. అలా సామాన్యుల నుంచి హౌస్‌లోకి అడుగు పెట్టిన తొలి కంటెస్టెంట్ కల్యాణ్.
తొలుత ఆకట్టుకోకపోయినా..
తొలినాళ్లలో కల్యాణ్ ఆటతీరు ఏమంత ఆసక్తికరంగా సాగలేదు. ఎక్కువ మంది కంటెస్టెంట్‌లు ఉండటంతో అతడికి స్క్రీన్ స్పేస్‌కూడా తక్కువే వచ్చింది. ప్రియ ఎలిమినేట్ తర్వాత నుంచి కల్యాణ్ ఆట తీరు మారింది. చివరి వరకూ తనదైన శైలిలో ఆడుతూ ముందుకు సాగాడు. తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్‌ల నుంచి కల్యాణ్‌కు గట్టి పోటీ ఎదురైంది. తనదైన ఆట తీరుతో హౌస్‌కు చివరి కెప్టెన్‌గా, మొదటి ఫైనలిస్ట్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్-9 విజేతగా నిలిచి ప్రైజ్ మనీతో పాటు, ట్రోఫీని కైవసం చేసుకున్నాడు.
అదనపు బెనిఫిట్స్ ఇవే!
షో స్పాన్సర్స్ లో ఒకరైన రాఫ్ గ్రిప్పింగ్.. కల్యాణ్‌కు మరో రూ.5లక్షల క్యాష్ ప్రైజ్‌ను అందించారు. అలాగే మారుతీ సుజుకీ విక్టోరిస్ కారును కూడా కల్యాణ్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాడు కల్యాణ్. తనను ప్రేమించిన వారికి, నమ్మి నమ్మి ఓటు వేసిన వారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నట్లు చెప్పాడు. ఈ సీజన్‌లో ప్రియ, శ్రీజ, తనూజ తనను ఎంతో సపోర్ట్ చేశారని.. వారు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు విన్నర్ గా నిలిచినట్లు చెప్పాడు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాడు.





