
చండూరు, క్రైమ్ మిర్రర్:-
చండూరు పట్టణంలో నిలిచిపోయిన 400 మీటర్ల రోడ్డు వెడల్పు పనులకు వెంటనే సెంట్రల్ లైన్ ఫిక్స్ చేసి మార్కింగ్ చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశం ఇచ్చారు. శుక్రవారం మునుగోడు లోని తన క్యాంపు కార్యాలయంలో చండూరు మున్సిపాలిటీలో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులపైన సమీక్ష నిర్వహించారు. రోడ్డు మీదికి వచ్చిన ఇల్లీగల్ బాల్కనీ నిర్మాణాలకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలిచ్చారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న 400 మీటర్ల రోడ్డు వెడల్పు కు సెంట్రల్ లైన్ ఫిక్స్ చేసి మార్కింగ్ చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.. రెండు కిలోమీటర్ల పొడవుతో చండూరు పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు వెడల్పు పనులు 1600 మీటర్ల పొడవు వరకు పూర్తయ్యాయి… మిగిలిన 400 మీటర్ల రోడ్డు వెడల్పు విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్ని ఫీట్ల వరకు రోడ్డు వేయొచ్చు, ఆ తర్వాత రోడ్డు వెడల్పు లో ఇరువైపులా ఎంతమంది ప్రైవేట్ ఆస్తులు కోల్పోయే అవకాశం ఉంది అనే విషయాలకు సంబంధించి సమగ్రమైన రిపోర్టు అందజేయాలని అధికారులను ఆదేశించారు.
మనం శాశ్వతం కాదని మనం చేసే అభివృద్ధి శాశ్వతమని ఇప్పుడు చేసే రోడ్డు వెడల్పు పనులు రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్తు అవసరాలకు పనికొస్తాయని అన్నారు.. రోడ్డు వెడల్పు అభివృద్ధిలో ఆస్తులు కోల్పోయే వారికి వీలైనంత వరకు ఎవరికి నష్టం కాకుండా చేస్తానని హామీ ఇచ్చారు..ఈ రెండు కిలోమీటర్ల రోడ్డు వెడల్పు అభివృద్ధి పనులే కాకుండా భవిష్యత్తులో 6 కిలోమీటర్లు ఉన్న చండూరు మున్సిపాలిటీ పరిధి వరకు రోడ్డును అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు…. చండూరు పట్టణంలో 60 ఫీట్ల వెడల్పుతో అంతర్గత రహదారులను అభివృద్ధి చేసుకోవాలని.. వీటితోపాటు రాబోయే 25 సంవత్సరాలకు సరిపడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తో పాటు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకోవాలన్నారు…
ఈ సమీక్ష సమావేశంలో చండూరు మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ, ఎస్ ఈ వెంకటేశ్వర్లు, ఈ ఈ సత్యనారాయణ, షాపులు కోల్పోతున్న యజమానులు, చండూరు నాయకులు పాల్గొన్నారు.