Wednesday, February 18, 2026
Homeతెలంగాణరేపు ఢిల్లీలో మీటింగ్.. మంత్రులకు కొత్త టెన్షన్

రేపు ఢిల్లీలో మీటింగ్.. మంత్రులకు కొత్త టెన్షన్

రాష్ట్ర రాజకీయాల్లో ఢిల్లీ మీటింగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈనెల 19న ఏఐసీసీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్‌తో పాటు రాష్ట్ర మంత్రులతో ఢిల్లీలో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే మంత్రుల పనితీరుపై వివిధ స్థాయిల్లో సేకరించిన ప్రోగ్రెస్ రిపోర్టులు హైకమాండ్ వద్ద ఉన్నట్లు సమాచారం. వాటి ఆధారంగా ఒక్కో మంత్రిని విడిగా పిలిచి మాట్లాడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు ఢిల్లీ మీటింగ్‌లో ఏమి జరుగుతుంది, ఎవరికి ప్రశంసలు దక్కుతాయి, ఎవరికి క్లాస్ పడుతుంది, తమ రిపోర్టులో ఏముంది అన్న ఆందోళన మంత్రుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మంత్రులు ఢిల్లీకి చేరుకుని సమావేశానికి సిద్ధమవుతున్నారు.

పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు మంత్రులు, పార్టీ అధ్యక్షుడి పనితీరుపై నివేదికలు సమర్పిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మినిస్టర్ల పనితీరుపై హైకమాండ్‌కు వివరాలు అందించినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రత్యేక దూతల ద్వారా కూడా అదనపు నివేదికలు తెప్పించుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నివేదికలను సమగ్రంగా పరిశీలించిన ఏఐసీసీ నేతలు మంత్రుల పనితీరుపై ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు. కొంతమంది మంత్రులపై అధిష్టానానికి ఫిర్యాదులు చేరినట్లు, అందులో సహచర మంత్రుల కంప్లయింట్లు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి మంత్రిని విడిగా పిలిచి నివేదికల్లో ప్రస్తావించిన నెగెటివ్ అంశాలపై వివరణ కోరే అవకాశం ఉందని సమాచారం.

మరోవైపు మెజార్టీ మంత్రులపై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తెలిసింది. తమ శాఖల్లో అవినీతితో పాటు జిల్లాల్లో భూ వివాదాలు, రియల్ ఎస్టేట్ మరియు కన్‌స్ట్రక్షన్ వ్యాపారులతో సంబంధాలు, ఇసుక మాఫియాతో అనుబంధాలపై ఫిర్యాదులు అధిష్టానానికి చేరినట్లు ప్రచారం. కొందరు మంత్రులు అధికారులతో ఘర్షణలు పడటం, వారిని అవమానపరిచే విధంగా వ్యవహరించడం వంటి అంశాలు కూడా నివేదికల్లో ఉన్నట్లు సమాచారం. ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని వివాదాలు ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించాయి. ఈ అంశాలన్నింటిపై ఢిల్లీ సమావేశంలో సీరియస్‌గా చర్చ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక కొన్ని శాఖల్లో మంత్రుల కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువగా ఉన్నదనే ఆరోపణలు కూడా హైకమాండ్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. శాఖలోని ఫైళ్లను సన్నిహితులు పర్యవేక్షించడం, చిన్న పనులకే కుటుంబ సభ్యుల అనుమతి అవసరమని ఫిర్యాదులు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారాలపై అధిష్టానం కఠినంగా స్పందించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే కౌన్సెలింగ్ ఇవ్వడం లేదా హెచ్చరికలు జారీ చేయడం వంటి చర్యలు ఉండొచ్చని సమాచారం.

ఢిల్లీ మీటింగ్ తర్వాత పనితీరు సరిగా లేని మంత్రులపై చర్యలు ఉంటాయా అనే ప్రశ్న కూడా ఉత్కంఠ రేపుతోంది. కేబినెట్ నుంచి తప్పిస్తారా, లేక శాఖల మార్పు వరకే పరిమితం అవుతారా అన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తక్షణ మార్పులు ఉండకపోవచ్చని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాకే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లేదా శాఖల మార్పులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అదే సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మహేశ్ కుమార్ గౌడ్ పనితీరుపై కూడా అధిష్టానం నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ ఎంతవరకు సక్సెస్ అయిందో, ఏఐసీసీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఎంతమేర విజయవంతం చేసిందో అన్న అంశాలపై కూడా చర్చ జరగనున్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే ఢిల్లీ మీటింగ్ రాష్ట్ర మంత్రుల భవిష్యత్‌పై ప్రభావం చూపే కీలక రాజకీయ పరిణామంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ALSO READ: PM Kisan: ఫిబ్రవరి చివరి వారంలో రైతుల ఖాతాల్లో 22వ విడత డబ్బులు?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments