
మూసీ నది ఉప్పొంగింది.. చరిత్రలో తొలిసారి మహాత్మగాంధీ బస్ స్టేషన్ మునిగిపోయింది. గతంలోనూ హైదరాబాద్ లో కుండపోతగా వర్షాలు కురిశాయి. కాని ఎప్పుడు ఎంజీబీఎస్ మునగలేదు. 2020లో 25 సెంటిమీటర్ల వర్షం కురిసింది. మూసీ ఉప్పొంగింది. కానీ మూసీ తీరంలో కాలనీల్లోకి వరద రాలేదు. ఈసారి ఎందుకు వరద అంతలా ముంచెత్తింది.. అసలేం జరిగింది..
మూసీ నదిపై నిజాం కాలంలోనే కట్టిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ జంట జలాశయాలను మూసీ వరద నుంచి నగరాన్ని కాపాడేందుకు.. నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేలా నిర్మించారు. ఈ ఏడాది భారీగా వర్షాలు కురిశాయి. ఆగస్టులోనే రెండు జంట జలాశయాలు నిండిపోయాయి. గేట్లు కూడా ఓపెన్ కూడా చేశారు. సెప్టెంబర్ 25 అంటే వరదలు వచ్చిన ముందు రోజు వరకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ వరకు నిండిఉన్నాయి.
ప్రాజెక్టులు నిర్వహణ చూసే అధికారులు ఇలాంటి సమయంలోనే అప్రమత్తంగా ఉంటారు. రిజర్వాయర్ ఫుల్లుగా ఉంటే.. దాని ఎగువన చిన్న వర్షం వచ్చే సూచన ఉన్నా వెంటనే డ్యాంను ఖాళీ చేస్తారు. పైనుంచే వచ్చే వరదకు అనుగుణంగా ముందే డ్యాం నుంచి నీటిని దిగువకు వదులుతారు. కాని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ విషయంలో.. వీటి నిర్వహణ చూస్తే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్( hmw) అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైకోర్టు. రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల క్యాచ్ మెంట్ ఏరియాలో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందని, ఆకస్మిక వరదలు వస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది.
మూసీ క్యాచ్ మెంట్ ఏరియా అయిన వికారాబాద్ జిల్లాకు క్లౌడ్ బరస్ట్ వార్నింగ్ ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీటిని రిలీజ్ చేయలేదు. ఐఎండీ చెప్పినట్లే సెప్టెంబర్ 25, 26 తేదీల్లో వికారాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. ఆకస్మిక వరదలు వచ్చాయి. ఎగువ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు భారీగా వరద పోటెత్తింది. ఆకస్మిక వరదలు వచ్చాకా స్పందించిన అధికారులు ఒక్కసారిగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తి దాదాపు 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో మూసీ గతంలో ఎప్పుడు లేనంతగా ఉగ్రరూపం దాల్చింది. ఎంజీబీఎస్ ను జలమయం చేసింది. మూసీ తీర ప్రాంతాలను ముంచేసింది. అంతేకాదు గేట్లు ఎత్తేముందు పరివాహక ప్రజలకు ఎలాంటి అలర్ట్ ఇవ్వలేదు. అందువల్లే వరద వచ్చే వరకు కాలనీల్లోనే ప్రజలు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
ఐఎండీ క్లౌడ్ బరస్ట్ ఇచ్చినప్పుడు అధికారులు అప్రమత్తమై హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి ముందే నీరు వదిలితే.. వికారాబాద్ జిల్లా నుంచి వచ్చిన ఆకస్మిక వరదలు వచ్చినా.. కొంత డ్యాంలో నింపి.. మిగితా వరద మూసీలోకి వదిలే అవకాశం ఉండేది. ఇంత ప్రమాదం జరిగేది కాదు.