హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నేడు (జూన్ 10) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు బాలయ్యకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన బాలకృష్ణ ఇప్పటికీ వరుస విజయాలతో యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.
బాలకృష్ణ సినీ ప్రయాణంలో ప్రత్యేకతలు…
తండ్రి నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న బాలకృష్ణ చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టారు. బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన ఆయన, తర్వాత హీరోగా ఎదిగి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, సైన్స్ ఫిక్షన్ వంటి దాదాపు అన్ని జానర్లలో నటించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు.
ఇప్పటివరకు 17 చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య, తన కెరీర్‌లో ఒక్క రీమేక్ సినిమా కూడా చేయకపోవడం విశేషం. అలాగే తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి 10కుపైగా సినిమాల్లో నటించారు. చెంఘీజ్ ఖాన్ , గోన గన్నారెడ్డి వంటి చారిత్రక పాత్రలను పోషించాలన్న కోరికను ఆయన పలుమార్లు వ్యక్తం చేశారు.
బాలయ్య గురించి తెలియని ఆసక్తికర విషయాలు…
బాలకృష్ణకు లక్ష్మీనరసింహస్వామి పై ప్రత్యేక భక్తి ఉంది. అందుకే ఆయన సినిమాల్లో సింహా అనే పదం తరచూ కనిపిస్తుంది. సింహా పేరుతో వచ్చిన చిత్రాలు కూడా భారీ విజయాలు సాధించాయి. క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే బాలయ్య ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి పూజలు పూర్తి చేసిన తర్వాతే తన రోజువారీ కార్యక్రమాలు ప్రారంభిస్తారని సన్నిహితులు చెబుతుంటారు.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్ రూపొందించాలన్నది బాలయ్య కల. అంతేకాకుండా ఆ చిత్రానికి స్వయంగా దర్శకత్వం వహించాలని కూడా ఆయన కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన అఖండ 2: తాండవం విడుదలకు సిద్ధమవుతుండగా, దర్శకుడు గోపీచంద్ మలినేని తో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్, అలాగే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. 100కు పైగా చిత్రాలు పూర్తి చేసిన బాలయ్య, నేటికీ తన మాస్ ఇమేజ్‌తో తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తున్నారు.