
కాలేజీ పరిసరాల్లో విద్యార్థినులను అసభ్య పదజాలంతో వేధిస్తూ, ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ రెచ్చిపోయిన పోకిరీలకు పోలీసులు గట్టి బుద్ధి చెప్పారు. మహిళల భద్రతపై రాజీ లేదన్న సంకేతంగా, నిందితులకు ప్రజల ముందే అవమానకర శిక్ష విధించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుని దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ప్రతిరోజూ కాలేజీ గేట్ల వద్ద నిలబడి వచ్చీ పోయే విద్యార్థినులను లక్ష్యంగా చేసుకున్న ఇద్దరు యువకులు, అసభ్య పదజాలంతో వేధింపులకు పాల్పడేవారని పోలీసులు వెల్లడించారు. ఆ వేధింపులను వీడియోలుగా చిత్రీకరించి ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ లైక్స్, కామెంట్స్ కోసం మరింత రెచ్చిపోయారని దర్యాప్తులో తేలింది. వీడియోలకు స్పందన పెరిగిన కొద్దీ వారి ప్రవర్తన మరింత దిగజారిందని అధికారులు తెలిపారు.
విద్యార్థినులు, స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో పోలీసులు నిందితులపై నిఘా పెట్టారు. తగిన ఆధారాలు సేకరించిన అనంతరం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రజలకు గట్టి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో వారికి కఠిన హెచ్చరిక చర్యలు చేపట్టారు. సగం గుండు, సగం మీసం చేయించి, మిగిలిన జుట్టుకు పిలకలు వేసి ఊర్లో ఊరేగించారు. తల్లిదండ్రులు కూడా గుర్తుపట్టలేని విధంగా వారిని తయారు చేసి ప్రజల ముందు నిలబెట్టారు.
ఈ సందర్భంగా విద్యార్థినుల భద్రతపై అవగాహన కల్పించేలా నిందితులతో స్వయంగా క్షమాపణ చెప్పించారు. ఇకపై ఎప్పుడూ మహిళలను వేధించబోమని, ఇలాంటి చర్యలకు పాల్పడబోమని వారు వేడుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల ఈ చర్యతో కాలేజీ పరిసరాల్లో భయాందోళనలు తగ్గాయని, విద్యార్థినుల్లో ధైర్యం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు.
ఇంతకాలం అమ్మాయిలను వేధించి వీడియోలు వైరల్ చేసిన పోకిరీలే ఇప్పుడు తమ వీడియోలతోనే సోషల్ మీడియాలో చర్చకు కేంద్రబిందువయ్యారు. పోలీసుల చర్యపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు మహిళల భద్రత కోసం ఇలాంటి కఠిన చర్యలు అవసరమేనని మద్దతు తెలుపుతుండగా, మరికొందరు చట్టపరమైన శిక్షలే సరైన మార్గమని అభిప్రాయపడుతున్నారు. కాలేజీలు, విద్యాసంస్థల పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
ALSO READ: Alert: ఒక్కరోజు వైన్ షాపులు బంద్





