
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్: నల్లమల అడవుల్లో పారే రాళ్లవాగు ఇప్పుడు వజ్రాల వాగుగా ప్రసిద్ధి చెందుతోంది. వజ్రాలు దొరకవచ్చనే నమ్మకంతో పేదలు, కూలీలు పెద్ద సంఖ్యలో వజ్రాల వేటకు తరలివస్తున్నారు. మహానంది మండలం గాజులపల్లె సమీపంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వజ్రాలతో తలంబ్రాలు పోశారన్న విశ్వాసం స్థానికులను ఆకర్షిస్తోంది. ఆలయం కింద ప్రవహించే రాళ్లవాగులో వజ్రాలు లభ్యమవుతున్నాయనే ప్రచారం పెరగడంతో, ప్రజలు తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు వజ్రాలు దొరకకపోయినా, సుద్దరాళ్లు మాత్రం ఎక్కువగా దొరుకుతున్నాయి.
సోషల్ మీడియా ప్రభావంతో వజ్రాల వాగు పేరు దూరదూరాల వరకు వ్యాపించడంతో వందలాది మంది ఆశావహులు వాగు వైపు తరలివస్తున్నారు. గాజులపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో ఉండటం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉండటంతో మహిళల రాక కూడా పెరిగింది. గుంటూరు, విజయవాడ, ప్రకాశం జిల్లాల నుంచి కూడా కూలీలు ఈ వజ్రాల వేటలో చేరుతున్నారు. వాగు వద్ద జల్లెడలు, గడ్డపారలతో తవ్వకాలు కొనసాగుతుండగా, అక్కడే కొందరు వజ్ర పరీక్షకులు రాళ్లను పరిశీలిస్తున్నారు. పరీక్షించేందుకు రేటు పది రూపాయల నుంచి ముప్పై రూపాయలకు పెరిగింది.
వజ్రాల వేటతోపాటు వాగు పరిసరాల్లో కొత్తగా హోటళ్లు, కూల్‌డ్రింక్ షాపులు, ఐస్‌బండ్లు ఏర్పడి ప్రాంతం సందడిగా మారింది. వజ్రాలు దొరకకపోయినా, వ్యాపారం మాత్రం ఊపందుకుంది. ఫారెస్ట్ పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో వందలాది మంది నిరంతరం వజ్రాల కోసం తవ్వుతుండగా, అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నిపుణులు, స్థానికులు ఫారెస్ట్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు నివారించవచ్చని సూచిస్తున్నారు.
ALSO READ: బిహార్ ఫలితాలు.. 501 కిలోల లడ్డూల ఆర్డర్‌తో జోష్‌లో బీజేపీ





