క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగబోయే ఇండో-యూఎస్ సమ్మిట్ (Indo-US Summit) నేపథ్యంలో ప్రపంచ పెట్టుబడిదారులను తెలంగాణకు ఆహ్వానించడం, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాలను వారికి వివరించడం కోసం ఈ పర్యటనకు ప్రధాన కారణం యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం (USISPF) సమావేశంలో పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో, గురువారం రాత్రే ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చని సమాచారం. గురువారం ఉదయం జరిగిన USISPF సమావేశంలో పాల్గొని, తెలంగాణను పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ పర్యటనలో ఆయన కొందరు కేంద్ర మంత్రులను కలిసి మెట్రో రైలు విస్తరణ, మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు వంటి రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, నిధులపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిసి డీసీసీ అధ్యక్షుల నియామకం వంటి పార్టీ సంస్థాగత విషయాలపై చర్చించే అవకాశం కూడా ఉంది. గత 23 నెలల్లో రేవంత్ రెడ్డికి ఇది 56వ ఢిల్లీ పర్యటన కావడం గమనార్హం.





