- 21తులా బంగారం, నగదు అపహరణ
మధురవాడ, క్రైమ్ మిర్రర్ః తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఓ రిటైర్డ్ లైన్‌మెన్ ఇంట్లో చోరీ జరిగిన ఘటన పీ.ఎం.పాలెం క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మధురవాడ శివశక్తినగర్ రోడ్డు వివేకానంద కాలనీలో నివసిస్తున్న విశ్రాంత లైన్‌మెన్ బొడ్డేటి అప్పలరాజు ఈనెల 2వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లారు. శనివారం14న ఉదయం యాత్ర ముగించుకుని ఇంటికి చేరుకోగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటం గమనించి షాక్‌కు గురయ్యారు.
ఇంటి లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువాలో భద్రపరిచిన సుమారు 21 తులాల బంగారం, రూ.6 లక్షల నగదు దొంగలు అపహరించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పీ.ఎం.పాలెం క్రైమ్ సీఐ బి.ఎస్.ఎస్. ప్రకాష్ పర్యవేక్షణలో ఎస్ఐ సూర్యప్రకాష్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.
