-
నేరుగా రాష్ట్రాన్ని తాకనున్న ఆర్నాబ్
-
హుద్ హుద్, తితలీ తరువాత అతిపెద్ద విలయం
-
జాగ్రత్త పడుకుంటే ముప్పే
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: తుఫాన్.. ఈ మాట అంటేనే ఏపీలో తీర ప్రాంతం వణికి పోతుంది. ప్రతి సంవత్సరం జూన్ నుంచి అక్టోబర్ వరకు తీర ప్రాంతానికి ఎప్పుడూ ప్రమాద హెచ్చరికలే. అయితే గత దశాబ్ద కాలంలో ఏపీ తీరాన్ని వణికించిన పెను తుఫాన్ ల తీవ్రతను తలపిస్తూ బంగాళాఖాతంలో మరో భారీ విపత్తు తాజాగా తీరం వైపు దూసుకొస్తుంది. ఆర్నాబ్ తుఫాను తీరప్రాంత ప్రజల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. గతంలో 2014 నాటి హుద్ హుద్ గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు.. 2018 నాటి తితలి 222 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు… గత ఏడాది మొంతా తుఫానులో 110 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు విధ్వంసం సృష్టించాయి. అయితే ఈ మూడు విపత్తులకు మించి ఆర్నాబు ఉంటుందన్న అంచనాలు ఏపీ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
తీరం దాటేది మన దగ్గరే…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండం గా మారింది.. ఆపై తుఫాన్ గా విరుచుకుపడుతూ తీరంపై దూసుకొస్తుంది. దానికి ఆర్నాబ్ అని పేరు పెట్టారు. ఇది తీరం దాటే సమయంలో అత్యంత ప్రమాదకరమైన తీవ్రతతో విరుచుకుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి ఈ భీకర తుఫాను పక్క రాష్ట్రాల వైపు కాకుండా నేరుగా ఏపీ తీరాన్ని తాకనుంది. అందుకే ఏపీ ప్రభుత్వం జాగ్రత్తపడుతోంది. యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు హెచ్చరికలు ఇస్తోంది. అతి తీవ్ర తుఫాను వస్తుందని తెలియడంతో ఏపీ ప్రజలు అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది.
వారం పాటు విస్తారంగా వర్షాలు…
ఈ భారీ తుఫాన్ ప్రభావంతో దాదాపు వారం రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. తాగు/ సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా ఖాళీ అయ్యాయి. విస్తారంగా వర్షాలతో కొంత ఉపశమనం పొందవచ్చు. జలాశయాల్లోకి వరద నీరు చేరి రాబోయే వేసవి కాలానికి నీటి ఎద్దడి తీరే అవకాశం ఉంది. ఈ వర్షాలు సాధారణ రీతిలో కాకుండా పెను తుఫాను రూపంలో కొండపోతగా విరుచుకు పడితే మాత్రం ఇబ్బందికరమే.
ఊహకు అందని నష్టం…
ఈ తుఫాను సృష్టించే అతివృష్టి వల్ల.. సానుకూలతల కంటే కూడా ఆర్నబ్ మిగల్చనున్న ఆస్తి, మౌలిక సదుపాయాల నష్టం ఊహకు అందని స్థాయిలో ఉండే ప్రమాదం ఉంది. ప్రచండ వేగంతో వీచే గాలుల ధాటికి వేలాది విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, భారీ వృక్షాలు నేలకూలి కమ్యూనికేషన్ నెట్వర్కులు, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోతాయి. లోతట్టు ప్రాంతాలు, పట్టణ కాలనీలు నీట మునిగి ఇల్లు దెబ్బ తినడం, సముద్రపు అలలు చొచ్చుకొని వచ్చి తీరప్రాంత ఆస్తులు కోతకు గురి కావడం వంటివి జరుగుతాయి అని అనిపిస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల హడావిడిలో ఉన్న అధికారులు.. ఈ భారీ విధ్వంసం నుంచి కోలుకొని సహాయ చర్యలు చేపట్టడం, విద్యుత్ పునరుద్ధరణ వంటివి కష్టతరంగా మారే అవకాశం ఉంది. అన్నింటికీ మించి ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు వచ్చి.. వరి, పత్తి, మిరప వంటి కీలక పంటలు చేతికొచ్చే లేదా కోత దశలో ఉన్న తరుణంలో.. ఈ భారీ వర్షాలు పంటలకు తీవ్ర నష్టం గురిచేసే అవకాశం ఉంది. అందుకే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఇవి కూడ చదవండి:
- బీహార్లో దారుణం.. ఏడాదిన్నర బాలుడిని హత్య చేసిన సొంత అన్న?
-
ఫౌండేషన్ ముసుగులో రాజకీయ అవతారమా?
-
అమెరికా పోలీసులకు చిక్కిన ఇద్దరు భారత గ్యాంగ్స్టర్లు
-
భర్తల చేతిలో భార్యల హతం.. ! శివన్నగూడెంలో వరుస హత్యల కలకలం…
