హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: హైదరాబాద్ నగర శివారులోని కోకాపేట నియోపోలిస్ ప్రాంతంలో ఓ వ్యక్తిదారుణ హత్య కలకలం రేపింది. ఖమ్మం జిల్లాకు చెందిన కంపాటి వెంకన్న (45) మృతదేహం నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నియోపోలిస్ సమీపంలో లభ్యమైంది. తలపై తీవ్ర గాయాలు ఉండటంతో క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా వెంకన్న ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అదే సమయంలో ఆయన ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. వాహనాలను తాకట్టు పెట్టుకుని ఆర్థిక లావాదేవీలు నిర్వహించే క్రమంలో కొందరితో వివాదాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
కారు ఫైనాన్స్ వివాదమే కారణమా…?
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. వెంకన్న ఒక కారును తాకట్టు పెట్టుకుని ఫైనాన్స్ లావాదేవీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ కారును వెంకన్నకు తెలియకుండా తీసుకెళ్లిన విషయంపై వివాదం తలెత్తినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. హత్యకు ముందు వెంకన్నను కొందరు వ్యక్తులు కారు ఫైనాన్స్ వ్యవహారానికి సంబంధించి నార్సింగి వైపు తీసుకెళ్లినట్లు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అనంతరం ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మరుసటి రోజు పోలీసులు ఆయన హత్యకు గురైన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
మేనల్లుడిపై బలపడుతున్న అనుమానాలు…
ఈ హత్య కు సంబంధించి వెంకన్న మేనల్లుడు, అతడి స్నేహితుడి పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేసినట్లు తాజా సమాచారం. వారిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే హత్యకు అసలు కారణం, నిందితుల పాత్రపై పూర్తి స్పష్టత దర్యాప్తు అనంతరం వెలువడాల్సి ఉంది. వెంకన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి దూరంగా కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటూ పీహెచ్‌డీతో పాటు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ హత్యకు ఆర్థిక వివాదమే కారణమా? లేక వ్యక్తిగత కక్షలు కూడా ఉన్నాయా? అనే కోణాల్లో నార్సింగి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇవి కూడ చదవండి:
-
ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కాపీరైట్ వివాదంపై కీలక తీర్పు
-
యూట్యూబర్ రావణ్‌కు మరో షాక్.. ఉపా కేసులో దర్యాప్తు గడువు 30 రోజులు పొడిగింపు
-
ఫడ్నవీస్‌కు అభిజీత్ దీప్కే వార్నింగ్.. ‘మూడు నెలలు జైల్లో పెట్టినా మళ్లీ వస్తా’
-
తొర్రూరులో విషాదం.. ఇంట్లో ఉరేసుకుని 25 ఏళ్ల మహిళ మృతి
