ఏలూరు జిల్లాలో ఓ మహిళ అదృశ్యం కేసు అనూహ్య మలుపు తిరిగింది. పని ముగించుకుని ఇంటికి ఆటోలో బయలుదేరిన ఆదిలక్ష్మి (36) కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆటోడ్రైవర్‌ను విచారించగా సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల విచారణలో ఆటోడ్రైవర్ షేక్ యాకబ్ కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. ఆదిలక్ష్మి మెడలో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకునే ఉద్దేశంతో ఆమెను గోదావరిలోకి తోసేసినట్లు యాకబ్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆదిలక్ష్మి వద్ద సుమారు మూడు కాసుల బంగారు ఆభరణాలు ఉన్నట్లు సమాచారం.
ఆటోడ్రైవర్ ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు గోదావరిలో ఆదిలక్ష్మి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.
also read: కొత్తగూడెంలో భారీగా గంజాయి పట్టివేత.. 365 కిలోలకు పైగా స్వాధీనం
