Homeక్రైమ్నిమ్స్‌ డాక్టర్‌ ఇంట్లో "ఆపరేషన్స్‌...ఏసీబీకి ఆస్తుల షాక్ ...! రూ.80 కోట్లకు పైగా సామ్రాజ్యం...?

నిమ్స్‌ డాక్టర్‌ ఇంట్లో “ఆపరేషన్స్‌…ఏసీబీకి ఆస్తుల షాక్ …! రూ.80 కోట్లకు పైగా సామ్రాజ్యం…?

  • నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్‌పై ఏసీబీ దాడులు

  • రూ.80 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ సోదాల్లో సంచలన వివరాలు

  • ఫ్లాట్లు, ప్లాట్లు.. బ్యాంకు ఖాతాల్లోనూ భారీగా నగదు

  • 517 గ్రాముల బంగారం.. కార్లు, బైక్‌లు కూడా స్వాధీనం

  • నివాసం, కార్యాలయంతోపాటు మరో 7 ప్రాంతాల్లో సోదాలు

 

 

హైదరాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: వైద్యం చేసే చేతులు.. ఇంత భారీ ఆస్తుల వెనుక ఉన్నాయా? నిమ్స్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ వైద్యాధికారి ఇంటిపై ఏసీబీ అధికారులు చేపట్టిన తనిఖీలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఉదయం వరకు అంతా సాధారణంగానే ఉంది.. కానీ ఒక్కసారిగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగడంతో నిమ్స్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీభాస్కర్‌కు సంబంధించిన ఆస్తుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం ఏకకాలంలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీలు కొనసాగుతున్న కొద్దీ ఒక్కో ఆస్తి వివరాలు బయటపడటంతో అధికారులు సైతం వాటి పూర్తి విలువను లెక్కించే పనిలో పడ్డారు. ప్రాథమికంగా గుర్తించిన స్థిర, చరాస్తుల విలువ రూ.80 కోట్లకు పైగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. డాక్టర్‌ లక్ష్మీభాస్కర్‌ నివాసం, కార్యాలయంతో పాటు మరో ఏడు ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని విలువైన ఫ్లాట్ల నుంచి ఇతర జిల్లాల్లో ఉన్న భూముల వరకు ఆస్తుల వివరాలను అధికారులు సేకరించారు.

ఫ్లాట్ల జాబితా పెద్దదే…

కూకట్‌పల్లిలో రెండు విలాసవంతమైన ఫ్లాట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మణికొండ, పేట్‌బషీరాబాద్‌ ప్రాంతాల్లో మరో ఐదు ఫ్లాట్లకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నగరంలోని కీలక ప్రాంతాల్లో ఉన్న ఆస్తులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక ఓపెన్‌ ప్లాట్ల విషయానికొస్తే.. యాదాద్రి, నందిగామ, శామీర్‌పేట ప్రాంతాల్లో నాలుగు ప్లాట్లు ఉన్నట్లు తనిఖీల్లో గుర్తించినట్లు సమాచారం. అంతేకాకుండా విశాఖపట్నంలో సుమారు 800 గజాల స్థలం కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా హైదరాబాద్‌ నుంచి ఇతర ప్రాంతాల వరకు ఆస్తులు విస్తరించి ఉన్నట్లు ఏసీబీ పరిశీలనలో తేలింది.

బ్యాంకు ఖాతాల్లోనూ నగదు…

స్థిరాస్తులతో పాటు ఆర్థిక లావాదేవీలపైనా ఏసీబీ అధికారులు ఆరా తీశారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.41 లక్షల నగదు, పోస్టాఫీసు ఖాతాల్లో రూ.12 లక్షల డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు. మరో ప్రైవేటు సంస్థలో సుమారు రూ.35 లక్షల పెట్టుబడులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక తనిఖీల్లో 517 గ్రాముల బంగారం, మూడు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను కూడా అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్థిరాస్తులు, నగదు, పెట్టుబడులు, బంగారం, వాహనాలు.. ఇలా ఒక్కో విభాగంలో బయటపడిన వివరాలను ఏసీబీ అధికారులు నమోదు చేసుకున్నారు.

20 ఏళ్లుగా నిమ్స్‌లో సేవలు…

డాక్టర్‌ లక్ష్మీభాస్కర్‌ సుమారు రెండు దశాబ్దాలుగా నిమ్స్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత ఐదేళ్లుగా డిప్యూటీ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనపై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాల్లో లభించిన పత్రాలు, ఆస్తుల వివరాలు, బ్యాంకు లావాదేవీలు, పెట్టుబడులను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువను ప్రాథమికంగా రూ.80 కోట్లకు పైగా అంచనా వేసినప్పటికీ.. ప్రతి ఆస్తి మార్కెట్‌ విలువ, కొనుగోలు వివరాలు, ఆదాయ వనరులు తదితర అంశాలను పరిశీలించిన తర్వాతే తుది లెక్క తేలనుంది. దీంతో ఏసీబీ దర్యాప్తులో మరిన్ని ఆస్తుల వివరాలు బయటపడతాయా? ఇప్పటికే గుర్తించిన ఆస్తులకు సంబంధించి ఆదాయ వనరులను అధికారులు ఎలా నిర్ధారిస్తారు? అనే అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు