క్రైమ్ మిర్రర్ : ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భార్య సహా ఇద్దరు పూజారులను కాల్చి చంపిన నిందితుడు అరవింద్ సింగ్, పోలీసుల ఎదురుకాల్పుల్లో (ఎన్కౌంటర్) ప్రాణాలు కోల్పోయాడు. ఆజంగఢ్ జిల్లా శంభూపుర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. ఇంట్లో తన భార్య బబితా సింగ్ ఇద్దరు పూజారులు మహేంద్ర పాఠక్, అఖిలేశ్ మిశ్రాలతో కలిసి పూజా కార్యక్రమం నిర్వహిస్తుండగా అక్కడికి వచ్చిన అరవింద్ సింగ్ వారితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో తన వద్ద ఉన్న లైసెన్స్డ్ తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో భార్యతో పాటు ఇద్దరు పూజారులు అక్కడికక్కడే మృతి చెందారు.
కాల్పుల అనంతరం అరవింద్ తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఇంట్లోని ఓ గదిలో బంధించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిందితుడిని లొంగిపోవాల్సిందిగా కుటుంబ సభ్యులతో కలిసి సుమారు ఏడు గంటల పాటు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
అయితే అరవింద్ లొంగిపోవడానికి నిరాకరించి, పోలీసులపైకి కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అరవింద్, అతడి కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తండ్రీకొడుకులిద్దరూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితుడి ఇద్దరు కుమార్తెలు సురక్షితంగా బయటపడ్డారు. పూజా కార్యక్రమం విషయంలో ఏర్పడిన వివాదమే ఈ ముగ్గురి హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
also read : భారీ డీజే శబ్దం.. రెండో తరగతి బాలిక మృతి
