క్రైమ్ మిర్రర్ : దేశ రాజధానిలో విషాదకర ఘటన వెలుగుచూసింది. 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్య చేసిన ఘటన స్వరూప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం.. గత శుక్రవారం రాత్రి బాలిక తన 17 ఏళ్ల స్నేహితుడిని కలిసేందుకు వెళ్లింది. అక్కడికి చేరుకున్న తర్వాత మరో ముగ్గురు యువకులతో కలిసి ఆమెను తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నలుగురు కలిసి బాలికపై లైంగిక దాడికి పాల్పడి, ఆమెను హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
బాలిక మృతదేహాన్ని కుషాక్ రోడ్డుకు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో వదిలివేసినట్లు సమాచారం. రెండు రోజుల తర్వాత స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని గుర్తించడం కష్టంగా ఉండటంతో పోలీసులు దర్యాప్తులో భాగంగా పోస్టుమార్టం నిర్వహించారు. వైద్య పరీక్షల్లో లైంగిక దాడి జరిగినట్లు, శరీరంపై గాయాలు ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దర్యాప్తు అనంతరం నలుగురు అనుమానితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అరెస్టైన వారిలో 19 ఏళ్ల యువకుడితో పాటు ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు మృతురాలి స్నేహితుడైన 17 ఏళ్ల బాలుడిగా గుర్తించారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్, అత్యాచారం, హత్య, పోక్సో చట్టం తదితర నిబంధనల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : దారుణం.. ఐడెంటిటీ కార్డు ట్యాగ్‌తో భార్యను హత్య చేసి భర్త పరారీ
