నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇంట్లో ఆక్సిజన్‌పై ఆధారపడుతున్న ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రుద్రవరం మండలం ముత్తలూరు దళిత కాలనీలో జరిగింది.
ముత్తలూరుకు చెందిన పద్మావతి (45) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యుల సూచన మేరకు ఇంటివద్దే ఆక్సిజన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కరెంట్ లేకపోవడంతో పద్మావతికి ఆక్సిజన్ అందించే వ్యవస్థ పనిచేయలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, మార్గమధ్యంలోనే పద్మావతి మృతి చెందినట్లు సమాచారం.
విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్లే ఆక్సిజన్ అందక ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
also read: వేడి నీళ్ల బకెట్లో పడి నాలుగేళ్ల బాలిక మృతి.. మైలార్‌దేవ్‌పల్లిలో విషాదం
