బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అభిమానులకు షాకిచ్చే వార్త తెరపైకి వచ్చింది. ఎంతోకాలంగా తనదైన శైలిలో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) కార్యక్రమాన్ని నడిపిస్తున్న అమితాబ్.. ఈ షో నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారా? అనే చర్చ మొదలైంది.
ప్రస్తుతం KBC 18వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అమితాబ్ బచ్చన్.. తన బ్లాగ్‌లో చేసిన వ్యాఖ్యలతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చారు. కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ల వ్యక్తిగత జీవితాల్లో చోటుచేసుకున్న విషాద ఘటనలు తనను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.
కంటెస్టెంట్లు తమ జీవితాల్లో ఎదుర్కొన్న కష్టాలు, బాధాకరమైన అనుభవాలను పంచుకునే సమయంలో తాను కూడా భావోద్వేగానికి గురవుతున్నానని అమితాబ్ వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో తన భావోద్వేగాలను నియంత్రించుకోవడం కూడా కష్టంగా మారుతోందని ఆయన చెప్పినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఇక రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నట్లు అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో పరోక్షంగా ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఆయన త్వరలోనే KBCకి వీడ్కోలు పలకనున్నారా? అనే ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి.
అయితే అమితాబ్ బచ్చన్ KBC నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఆయన వ్యాఖ్యలు నిజంగానే షోకు గుడ్‌బై చెప్పే నిర్ణయానికి సంకేతమా? లేక ప్రస్తుత పరిస్థితులపై వ్యక్తిగత స్పందనా? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
also read: ఇరుముడి ఓటీటీ రిలీజ్‌పై కీలక నిర్ణయం.. రవితేజ సినిమాకు థియేటర్లలో తగ్గని జోరు!
