మహారాష్ట్రలోని పూణే సమీపంలోని చారిత్రక సింహగడ్ కోటలో పర్యాటకులపై దాడి ఘటన కలకలం రేపుతోంది. దుస్తుల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ మహిళ సహా పలువురు టూరిస్టులపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
దుస్తులపై ప్రశ్నించి దాడి
ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఈ ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. కోటలోని తానాజీ మలుసరే స్మారకం వద్ద కొందరు పర్యాటకులను ఓ సంస్థకు చెందిన వ్యక్తులు అడ్డుకున్నారని ఫిర్యాదులు వచ్చాయి. షార్ట్స్, స్లీవ్‌లెస్ దుస్తులు ఎందుకు ధరించారంటూ ప్రశ్నించి.. హిందూ సంస్కృతి పేరుతో వాగ్వాదానికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మహిళపైనా దాడి ఆరోపణలు
ఓ బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు తనపై దాడి చేయగా, ఓ మహిళ తన భార్యను పక్కకు లాగి కింద పడేసినట్లు పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలో మరో మూడు పర్యాటక బృందాలు కూడా ఇలాంటి వేధింపులకు గురైనట్లు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. అంతేకాకుండా, ఎనిమిదేళ్ల బాలిక బెర్ముడా ధరించడంపైనా కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఎనిమిది మందిపై కేసు
ఈ ఘటనపై హవేలీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సంకేత్ సంజయ్ పాటిల్, ఆశిష్ దిలీప్ అపర్ సహా మొత్తం ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. దాడి, అల్లర్లు, చట్టవిరుద్ధంగా గుమిగూడటం, నేరపూరిత బెదిరింపులు వంటి ఆరోపణలపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పర్యాటక ప్రదేశాల్లో సందర్శకులపై దుస్తుల విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని దాడులకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: క్రీడా ప్రసార రంగానికి కొత్త దిశ చూపిన ఈఎస్‌పీఎన్ సహ వ్యవస్థాపకుడు బిల్ రాస్ముసెన్ కన్నుమూత
