Homeజాతీయంవందేమాతరం విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం.. 1937 నాటి విధానానికే కట్టుబాటు

వందేమాతరం విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం.. 1937 నాటి విధానానికే కట్టుబాటు

క్రైమ్ మిర్రర్ : వందేమాతరం గీతం విషయంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. పార్టీ అధికారిక కార్యక్రమాలు, సమావేశాల్లో గీతంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలన్న 1937 నాటి నిర్ణయాన్నే కొనసాగించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ అంశంపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్న సమయంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

బుధవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వందేమాతరం అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా 1937లో అప్పటి కాంగ్రెస్ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు నేతలు ప్రస్తావించినట్లు సమాచారం. వివిధ వర్గాల ప్రజలు పాల్గొనే జాతీయ, ప్రజా కార్యక్రమాల్లో వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే పాడాలని అప్పట్లో నిర్ణయించారు.

ఇటీవల గోవాలో జరిగిన ఓ కాంగ్రెస్ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వందేమాతరంలోని తొలి రెండు చరణాలను ఆలపించారు. దీనిపై బీజేపీ నేతలు విమర్శలు చేశారు. గీతాన్ని పూర్తిగా ఆలపించకుండా అసంపూర్ణంగా పాడారని ఆరోపించారు.

ఈ విమర్శలకు ఖర్గే ఘాటుగా స్పందించారు. తాను మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వంటి కాంగ్రెస్ ప్రముఖులు అనుసరించిన సంప్రదాయాన్నే పాటించానని తెలిపారు. ఇదే విధానం తప్పు అయితే, గతంలో అదే విధంగా వందేమాతరాన్ని ఆలపించిన నాయకులనూ ప్రశ్నించాలని వ్యాఖ్యానించారు. వందేమాతరం గీతాన్ని ప్రముఖ రచయిత బంకిమ్ చంద్ర ఛటర్జీ 19వ శతాబ్దంలో రచించారు. ఈ గీతంలోని మొదటి రెండు చరణాల్లో భారత భూమి, ప్రకృతి, సస్యశ్యామలత్వాన్ని కీర్తించే అంశాలు ప్రధానంగా ఉంటాయి. తరువాతి భాగాల్లో మతపరమైన, పౌరాణిక ప్రతీకలు కనిపిస్తాయి.

దేశంలోని వివిధ మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొనే సమావేశాల్లో ఏకాభిప్రాయం కొనసాగించాలనే ఉద్దేశంతో 1937లో కాంగ్రెస్ ఒక విధానాన్ని రూపొందించింది. అందులో భాగంగా వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే అధికారిక జాతీయ, ప్రజా కార్యక్రమాల్లో ఆలపించాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ మధ్య వందేమాతరం అంశంపై రాజకీయంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ మాత్రం తన తాజా నిర్ణయం కొత్తది కాదని, దశాబ్దాలుగా కొనసాగుతున్న పార్టీ విధానాన్నే అనుసరిస్తున్నామని స్పష్టం చేస్తోంది. దీంతో ఈ అంశం మరోసారి దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
also read : ఉప్పుకు బదులు డిటర్జెంట్.. మిడ్ డే మీల్ తిని 36 మంది విద్యార్థులు అస్వస్థత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు