క్రైమ్ మిర్రర్ : తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొనడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం పొల్లాచ్చి-పళని జాతీయ రహదారిపై నల్లంపల్లి జంక్షన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని కోయంబత్తూరు జిల్లా మదుక్కరై సమీపంలోని గురుబంపాలయం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులను కనగరాజ్, ఆయన భార్య నర్మద, వారి కుమార్తెలు ఆర్తి, పూరణిగా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన మరో వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో బంధువులు, స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
also read : ఇంటి నుంచి 300 మీటర్లు ఈడ్చుకెళ్లిన పులి.. మహిళ మృతి
