మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పాల్ఘర్, ముంబై, పుణె సహా పలు జిల్లాలు నీటమునిగాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
జల్గావ్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా అంజనీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో ఓ వ్యక్తి వరదలో చిక్కుకుపోయాడు. పరిస్థితి అదుపులో లేకపోవడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి అతడు సమీపంలోని పెద్ద చెట్టు పైకి ఎక్కి ఆశ్రయం పొందాడు.
స్థానికులు వెంటనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. అయితే, నది ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో రక్షణ చర్యలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దీంతో బాధితుడు చెట్టుపైనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు ప్రకటించారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతినగా, వందలాది కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డాయి.
అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఉండాలని, నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
also read: నడి రోడ్డుపై బైక్ స్టంట్.. చూస్తుండగానే కిందపడిపోయాడు…
