హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మతపరమైన హోంవర్క్ అంశం వివాదానికి దారితీసింది. రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి ఇస్లామిక్ మతానికి సంబంధించిన పాఠాన్ని హోంవర్క్‌గా ఇవ్వడంతో తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన పాఠశాల యాజమాన్యం సంబంధిత టీచర్‌పై చర్యలు తీసుకుంది.
సైదాబాద్ ప్రాంతంలోని సక్సెస్ ప్రైవేట్ స్కూల్లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. రెండో తరగతి విద్యార్థి స్కూల్ డైరీలో ‘దీనియాత్’ సబ్జెక్టుకు సంబంధించి ‘సూరా ఫాతిహా’ చదవాలని హోంవర్క్‌గా నమోదు చేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు ‘కల్మా’ చదవాలని కూడా డైరీలో రాసినప్పటికీ, విద్యార్థి ముస్లింయేతర వర్గానికి చెందినవాడని గుర్తించిన తర్వాత దాన్ని తొలగించినట్లు సమాచారం.
ఈ విషయాన్ని గమనించిన విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించి అభ్యంతరం తెలిపారు. ఇతర మతాలకు చెందిన విద్యార్థులకు మతపరమైన అంశాలను బోధించడం సరైన విధానం కాదని వారు ప్రశ్నించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుపై స్పందించిన పాఠశాల యాజమాన్యం, ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొంది. బాధ్యురాలైన ఉపాధ్యాయురాలిని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించింది. భవిష్యత్తులో తమ విద్యాసంస్థల పరిధిలో ఆమెకు ఉద్యోగ అవకాశం ఉండదని స్పష్టం చేసినట్లు సమాచారం.
పాఠశాల యాజమాన్యం వివరణ ఇస్తూ.. తమ విద్యాసంస్థలో వివిధ మతాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారని, ముస్లిం విద్యార్థులకు ప్రత్యేకంగా దీనియాత్ బోధన ఉంటుందని తెలిపింది. అయితే ఇతర మతాలకు చెందిన విద్యార్థులకు ఆ బోధన వర్తించదని పేర్కొంది.
ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. మతపరమైన అంశాల్లో విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి ఉండకూడదని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సంబంధిత పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
also read: మధ్యప్రదేశ్‌లో హృదయాన్ని కదిలించే ఘటన… యజమాని అంతిమయాత్రలోనే కన్నుమూసిన పెంపుడు శునకం