హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఓ హత్య కేసులో ఏడాదికి పైగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న రౌడీషీటర్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితుడు ఏకంగా తన రూపాన్ని మార్చుకుని ఓ దర్గాలో మత గురువుగా జీవిస్తున్న విషయం దర్యాప్తులో బయటపడింది.
సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో మహ్మద్ షేక్ జావేద్ (33) ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కేసు నమోదైన తర్వాత గత ఏడాది జూన్ నుంచి అతడు పరారీలో ఉన్నాడు. అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ కావడంతో పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగించారు.
విశ్వసనీయ సమాచారం ఆధారంగా సైఫాబాద్‌లోని ఫూల్ బాగ్ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో జావేద్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు పోలీసులను తప్పించుకునేందుకు అనుసరించిన విధానం బయటపడింది.
also read: గోల్కొండ బోనాల జాతర షురూ.. అమ్మవారికి తొలి బోనం ఎత్తిన మంత్రి కొండా సురేఖ
జావేద్ సంగారెడ్డి జిల్లాలోని జిందేశా మదార్ దర్గాలో పీర్ బాబా వేషంలో ఉంటూ తన అసలు గుర్తింపును దాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సాధారణ వ్యక్తిలా కాకుండా మత గురువు రూపంలో జీవిస్తూ తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. అరెస్ట్ సమయంలో పోలీసులు అతడి వద్ద నుంచి 115 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మారువేషానికి ఉపయోగించిన దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటికే జావేద్‌పై లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. నేరస్థులు ఎంత తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేసినా, పక్కా సమాచారంతో వారిని పట్టుకుంటామని టాస్క్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు. అరెస్ట్ అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
also read: హైదరాబాద్ చరిత్రలో ఓ అధ్యాయం ముగింపు.. కూలుతున్న తాజ్ బంజారా, రానున్న భారీ ప్రాజెక్ట్