ఒకప్పుడు తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో అగ్ర కథానాయికగా వెలుగొందిన రంభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, నటన, నృత్యాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం చురుకుగా ఉంటూ తన కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారాయి.
ఆ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంలోని ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్న రంభ, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్ర హీరోలతో కలిసి నటించాలని తన కోరికను వ్యక్తం చేశారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్లతో కలిసి పనిచేసిన అనుభవం ఉందని చెప్పిన ఆమె, భవిష్యత్తులో అవకాశం వస్తే మహేష్ బాబు, ప్రభాస్‌లతో తప్పకుండా నటించాలని ఉందని వెల్లడించారు. ఆ ఇద్దరు హీరోలంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందని కూడా పేర్కొన్నారు.

తన కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రాల గురించి మాట్లాడిన రంభ, క్విక్ గన్ మురుగన్ తన జీవితంలో ఒక ప్రత్యేకమైన చిత్రమని చెప్పారు. ఈ చిత్ర కథ మొదటిసారి విన్నప్పుడు పూర్తిగా అర్థం కాలేదని, అయితే కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఆ పాత్రను అంగీకరించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా తాను పోషించిన మ్యాంగో డాలీ పాత్ర కోసం ప్రత్యేకంగా రూపొందించిన విగ్గు, దుస్తుల తయారీకి చాలా సమయం పట్టిందని గుర్తుచేసుకున్నారు. ఈ చిత్రానికి కొనసాగింపుగా మరో భాగాన్ని తెరకెక్కించే ఆలోచనలు ఉన్నాయని, అందుకు సంబంధించి తనను కూడా సంప్రదించినట్లు తెలిపారు.
కెరీర్‌లో ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ, తనకు నచ్చని కథలను తిరస్కరించానని రంభ వెల్లడించారు. కొన్ని చిత్రాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోయినా వాటిని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగానని, మొత్తం మీద తన సినీ ప్రయాణం పట్ల పూర్తి సంతృప్తి ఉందని పేర్కొన్నారు. సహనటుల గురించి మాట్లాడుతూ, చిరంజీవి తనకు ఎప్పటికీ ఇష్టమైన నటుడని చెప్పారు. తనతో కలిసి పనిచేసిన ప్రతి హీరో కూడా ఎంతో గౌరవంగా, ఆప్యాయంగా వ్యవహరించారని తెలిపారు.
బాలీవుడ్ విషయానికి వస్తే.. షారుఖ్ ఖాన్తో కలిసి నటించే అవకాశం రాలేదని చెప్పారు. అయితే అమీర్ ఖాన్తో కలిసి ఒక ప్రకటనలో నటించిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో మహేష్ బాబు, ప్రభాస్‌లతో ఒక సినిమా చేసే అవకాశం కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
ఇతర కథానాయికల గురించి మాట్లాడుతూ.. రమ్యకృష్ణతో కలిసి నటించే సమయంలో తనకు కొంత భయం ఉండేదని చెప్పారు. అయితే అది పోటీ వల్ల కాదని, ఆమె అనుభవం, సీనియారిటీ పట్ల ఉన్న గౌరవం కారణంగానే అని స్పష్టం చేశారు. ప్రస్తుత తరం కథానాయికల్లో త్రిష అంటే తనకు చాలా ఇష్టమని, ఆమె స్నేహపూర్వక స్వభావం ఎంతో నచ్చుతుందని తెలిపారు.
డ్యాన్స్ విషయానికి వస్తే.. చిరంజీవిపై అపారమైన అభిమానం ఉన్నప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ స్టైల్, అంకితభావం అసాధారణమని కొనియాడారు. డ్యాన్స్‌లో ఆయన చూపించే శ్రమ, పట్టుదల అద్భుతమని ప్రశంసించారు. చిన్ననాటి జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్న రంభ, చిన్నప్పుడు రాముడు-సీత ఆటలు ఆడేదానినని, అందులో సీత పాత్ర తనకే రావాలనే ఉద్దేశంతో చిన్న చిన్న మాయలు చేసేదానినని సరదాగా చెప్పారు. ఒకవేళ నటి కాకపోయి ఉంటే, తన అల్లరి స్వభావం చూసి చిన్న వయసులోనే తనకు పెళ్లి చేసేవారని తన తండ్రి చెప్పేవారని నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.
ALSO READ: సినిమాల్లోకి రాఘవ లారెన్స్ కూతురు..