-
కాంగ్రెస్ కు కలిసి వస్తున్న ‘కర్ణాటకం’
-
సునాయాసంగా అధికార మార్పిడి
-
డీకే శివకుమార్ హిందుత్వముద్ర
-
బిజెపి భయం కూడా అదే
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్:
కర్ణాటకలో కాంగ్రెస్ అధికార మార్పిడి సునాయాసంగా పూర్తయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎన్ని రకాల వ్యూహాలు పన్నినా.. అక్కడ చాలా సునాయాసంగా అధికార మార్పిడి జరిగిపోయింది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సిద్ధరామయ్య నుంచి ప్రభుత్వ పగ్గాలు అందుకోనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం తలెత్తుతుందని బిజెపి అంచనా వేసింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య అనుబంధంతో సునాయాసంగా తాను అనుకున్నది సాధించగలిగింది కాంగ్రెస్ హై కమాండ్.
శివ కుమార్ తో కొత్త సామాజిక వర్గం
ఇప్పటివరకు వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీల నాయకుడిగా ఉన్న సిద్ధరామయ్య కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ వర్గాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బలమైన వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు డీకే శివకుమార్ కు పగ్గాలు ఇవ్వడం ద్వారా మరో వర్గం కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతోంది. అదే వొక్కోలిగలు.
ఆ వర్గానికి చెందిన నేత డీకే శివకుమార్. కర్ణాటకలో ఈ సామాజిక వర్గం వారు 10 శాతం మంది ఉన్నారు. వీరిని తన చెప్పు చేతల్లో ఉంచుకోనున్నారు డీకే శివకుమార్. మరోవైపు భారతీయ జనతా పార్టీ మరో బలమైన సామాజిక వర్గం లింగాయత్ లపై ఆధారపడి ఉంది. కర్ణాటక సమాజంలో ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంకు 11%. అయితే ఆ సామాజిక వర్గానికి చెందిన యద్యూరప్ప వయోభారంతో బాధపడుతున్నారు. భారతీయ జనతా పార్టీకి అదో మైనస్.
హిందుత్వ భావజాలం..
మరోవైపు కాంగ్రెస్ పార్టీకి డీకే శివకుమార్ మరో రకంగా కలిసి రానున్నారు. ఆయన హిందుత్వముఖం పెట్టుకొని హిందూ ఓట్లను గట్టిగానే కొల్లగొట్టనున్నారు. బిజెపి భయం కూడా అదే. తరచూ ఆలయాలను సందర్శిస్తుంటారు డీకే శివకుమార్. హిందుత్వ భావజాలాన్ని గట్టిగానే ప్రదర్శిస్తుంటారు.
ఆధ్యాత్మికంగా కూడా మంచి పట్టు ఉంది ఆయనకు. అయితే హిందుత్వవాదంతో కర్ణాటకలో మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది బిజెపి. డీకే శివకుమార్ ఉండగా అది అంత సులువు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.