Homeఆంధ్ర ప్రదేశ్ఆ ముగ్గురి పైనే 'విజయవాడ' బాధ్యతలు...!

ఆ ముగ్గురి పైనే ‘విజయవాడ’ బాధ్యతలు…!

  • పార్లమెంటు బరిలో కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్, దేవినేని అవినాష్

  • అధినేతకు నో చెప్పిన ముగ్గురు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: విజయవాడ పార్లమెంట్ స్థానంపై దృష్టి పెట్టారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అక్కడ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని చూస్తున్నారు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, ఆపై యువకుడిని బరిలో దింపితే బాగుంటుందన్న అభిప్రాయంతో ఉన్నారు.

మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేసినేని నాని క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యారు. అందుకే ఈసారి కొత్త అభ్యర్థి అన్వేషణ మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ ఆవిర్భవించి మూడుసార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగితే.. మూడుసార్లు కూడా ఆ పార్టీ ఓడిపోయింది. అందుకే ఈసారి బలమైన నేతను రంగంలోకి దించాలని చూస్తున్నారు.

ఒకరు తప్పనిసరి..
ప్రధానంగా ముగ్గురి నేతల పేర్లను పరిగణలోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్, దేవినేని అవినాష్ లలో ఒకరు బరిలో దిగడం ఖాయమని తెలుస్తోంది. ఈ మేరకు సిద్ధంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి వారిని ఆదేశించినట్లు సమాచారం. టిడిపి నుంచి మరోసారి సిట్టింగ్ ఎంపి కేసినేని శివనాథ్ రంగంలోకి దిగే అవకాశం ఉంది. దీంతో ముందస్తుగా అభ్యర్థిని ఎంపిక చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వద్దంటున్న కొడాలి నాని..
ప్రధానంగా కొడాలి నాని అయితే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మంత్రిగా ఉంటూ కృష్ణా జిల్లాలో రాజకీయం చేశారు కొడాలి నాని. ఆయనకు జిల్లా వ్యాప్తంగా మంచి పట్టు ఉంది.

ఆపై కమ్మ సామాజిక వర్గం కావడంతో చంద్రబాబును వ్యతిరేకించే వర్గాలు తప్పకుండా కొడాలి నాని కి మద్దతు తెలుపుతాయి. అందుకే సిద్ధంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని కి సూచించారట. కానీ నాని పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అసలు పూర్తిగా పోటీలో ఉండనని.. పార్టీ కోసం పని చేస్తానని జగన్ కు తేల్చి చెప్పినట్లు సమాచారం.

వంశీ విముఖత..
మరోవైపు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు సైతం జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. 2009 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పార్లమెంట్ బరిలో నిలిచారు వల్లభనేని వంశీ మోహన్. కానీ ఆ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓడిపోయారు.

అటు తరువాత గన్నవరం నియోజకవర్గంపై దృష్టి పెట్టి.. జూనియర్ ఎన్టీఆర్ సహాయంతో 2014లో టిక్కెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో గెలిచారు కూడా. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం తట్టుకొని నిలబడ్డారు. 2024లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎంపీగా పోటీ చేసేందుకు మాత్రం వల్లభనేని వంశీ మోహన్ విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు గన్నవరం టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ.. విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేది లేదని తేల్చి చెబుతున్నట్లు సమాచారం.

అవినాష్ ఫైనల్..
చివరిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత దేవినేని అవినాష్ వైపు జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అవినాష్. ఆ ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పలేదు. 2019లో టిడిపి అభ్యర్థిగా గుడివాడ నుంచి బరిలో దిగారు. అప్పుడు కూడా ఓటమి తప్పలేదు. 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు.

అప్పట్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. అయితే ఈసారి విజయవాడ తూర్పు బదులు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాల్సిందేనని జగన్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. మిగతా ఇద్దరు నేతలు ఒప్పుకోకపోవడంతో అవినాష్ పై జగన్ ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. చూడాలి మరి అవినాష్ పోటీ చేస్తారా? లేదా?

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు