హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదురుగా ఉన్న ఆ మహానేత విగ్రహానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. 21వ శతాబ్దంలో దేశాన్ని కంప్యూటర్ యుగం వైపు నడిపించి ఒక దశ, దిశ చూపించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని గుర్తుచేశారు. సాంకేతిక యుగం వైపు దేశ యువతను సన్నద్ధం చేసిన నాయకుడని కొనియాడారు. మహాత్మగాంధీ, ఇందిరాగాంధీ లాంటి మహానాయకుల స్ఫూర్తితో పనిచేస్తూ రాజీవ్ గాంధీ దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించారని అన్నారు.
టెలికాం, కంప్యూటర్ లాంటి ఆధునిక సాంకేతిక విప్లవం తేవడమే కాకుండా పరిపాలనలో మహిళలను భాగస్వామ్యం చేసినప్పుడే దేశం పురోభివృద్ధి సాధిస్తుందని భావించి స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు. లోక్సభ, శాసనసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి చిక్కుముడులు లేకుండా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మరోసారి బిల్లును ప్రవేశపెట్టాలని ప్రధానమంత్రి ని కోరారు. తెలంగాణతో ఇందిరాగాంధీ కుటుంబానికి గొప్ప అనుబంధం ఉందని, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయడంలో సోనియా గాంధీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సలహాదారు వి హనుమంతరావు తో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.