HomeUncategorizedబీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి సంచ‌ల‌న కామెంట్స్‌....!ప్రాణహిత-చెవెళ్ల ప్రాజెక్టును నిర్వీర్యం చేశారంటూ ఫైర్‌...

బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి సంచ‌ల‌న కామెంట్స్‌….!ప్రాణహిత-చెవెళ్ల ప్రాజెక్టును నిర్వీర్యం చేశారంటూ ఫైర్‌…

కొమురంభీం ఆసిఫాబాద్,క్రైమ్ మిర్ర‌ర్ :  తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కావాలనే బలహీనపరచి, కేవలం కమిషన్ల కోసమే మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఉత్తర తెలంగాణకు జీవనాడిగా నిలిచే ప్రాణహిత-చెవెళ్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు.

శుక్రవారం మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి వివేక్ వెంకటస్వామి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాణహిత నదికి జలహారతి ఇచ్చి, శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

మంత్రి మాట్లాడుతూ, ప్రాణహిత-చెవెళ్ల ప్రాజెక్టు పనుల కోసం అప్పటికే సుమారు రూ.1100 కోట్లు ఖర్చు చేసి, భారీ స్థాయిలో పనులు పూర్తి చేశారని తెలిపారు. మరో రూ.25 వేల కోట్లు కేటాయించి ఉంటే ప్రాజెక్టు పూర్తయ్యేదని అన్నారు. కాకా వెంకటస్వామి గారు ఉత్తర తెలంగాణలో నీటి సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రాంతానికి ప్రాజెక్టు అవసరమని భావించారని గుర్తుచేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ అవసరాన్ని గుర్తించి ప్రాణహిత-చెవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు.

తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ కాలంలో ప్రాజెక్టు ఎత్తును 152 మీటర్లుగా నిర్ణయించే దిశగా ఒప్పందం జరిగిందని తెలిపారు. దాంతో మహారాష్ట్రలో సుమారు 5 వేల ఎకరాల ముంపు ఉండేదని, అందుకు పరిహారంగా రూ.5 వేల కోట్లు చెల్లిస్తే సరిపోయేదని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు ఎత్తును 148 మీటర్లకు తగ్గించి ప్రాణహిత-చెవెళ్లను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని, దాని ద్వారా కొంతమంది కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చారని విమర్శించారు.

ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో కలిసి పరిశీలించామని, శాస్త్రవేత్తలు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారని తెలిపారు. భారీ వ్యయంతో కేవలం 60 టీఎంసీల నీటిని మాత్రమే ఎల్లంపల్లికి తరలించారని, అందుకు రూ.3 వేల కోట్ల వరకు విద్యుత్ బిల్లులు వచ్చాయని పేర్కొన్నారు. రూ.35 వేల కోట్ల ప్రాజెక్టును లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టుగా మార్చారని ఆరోపించారు.

కేసీఆర్ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించిన మంత్రి, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తుమ్మిడిహెట్టి ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుమ్మిడిహెట్టికి వచ్చి ప్రాజెక్టుకు సంబంధించిన కార్యక్రమాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులంతా కలిసి, ముఖ్యనంగా బీజేపీ నాయకులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చించి 150 మీటర్ల ఎత్తుకు అనుమతి పొందేలా కృషి చేయాలని మంత్రి కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, పాల్వాయి హరీష్ బాబు, జిల్లా కలెక్టర్ హరిత, ఎస్పీ నిఖిత పంత్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు