Homeతెలంగాణతెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం.. ఆర్టీసీ చర్చలకు గ్రీన్ సిగ్నల్, రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం.. ఆర్టీసీ చర్చలకు గ్రీన్ సిగ్నల్, రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు సంచలన నిర్ణయాలకు వేదికైంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ సామాజిక పరిస్థితులపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి కీలక తీర్మానాలు చేసింది. ముఖ్యంగా ఆర్టీసీ సమ్మె విరమణకు ప్రభుత్వం సానుకూల సంకేతాలు పంపింది. కార్మికులు ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని సంయమనం పాటించాలని మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది. సమస్యల పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శుక్రవారం జరగనున్న ఈ చర్చల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ రావు జూపల్లి కృష్ణారావు పాల్గొననున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ దర్యాప్తును వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం విశ్లేషించింది. కేవలం నోటీసుల జారీలో ఉన్న సాంకేతిక లోపాలనే కోర్టు ప్రస్తావించిందని జ్యుడిషియల్ కమిషన్ రాజ్యాంగబద్ధతను సమర్థించిందని భావిస్తోంది. ఈ క్రమంలో సీబీఐ విచారణకు ఎలాంటి అడ్డంకులు లేవని న్యాయ నిపుణులు స్పష్టం చేయడంతో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిశ్చయించింది. మరింత స్పష్టత కోసం ఢిల్లీలోని సుప్రీంకోర్టు న్యాయవాదుల సలహా తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న రూ. 8,000 కోట్ల బకాయిలను వంద రోజుల్లోగా చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించిన రూ. 6,200 కోట్ల బిల్లుల పైనా దృష్టి సారించింది. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా ఉద్యోగుల ప్రయోజనాలే ముఖ్యమని ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైతే మంత్రులు ప్రజా ప్రతినిధుల జీతాల నుంచి 50 శాతం నిధులు కట్ చేసి ఈ బకాయిలు సర్దుబాటు చేస్తామని సాహసోపేత ప్రకటన చేసింది.

సహకార రంగ బలోపేతానికి పీఏసీఎస్ (PACS) పాలకవర్గాల నియామకానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. పదవీ కాలం ముగిసిన సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో కొత్త కమిటీలను వేయడం ద్వారా రైతులకు రుణాల పంపిణీ సాఫీగా జరిగేలా చూడాలని నిర్ణయించింది. అటు క్రీడా రంగానికి ఊతమిస్తూ గచ్చిబౌలి స్టేడియాన్ని పీపీపీ పద్ధతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనుంది. ఇక్కడ 76 ఎకరాల్లో 21 రకాల క్రీడలకు వసతులు కల్పించడంతో పాటు అత్యాధునిక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తారు. వాణిజ్య కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని క్రీడాకారుల శిక్షణకు వెచ్చిస్తారు.

ఉత్తర తెలంగాణ రైతులకు మేలు చేసే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికి నిధులు మంజూరయ్యాయి. భూసేకరణ కోసం అవసరమైన రూ. 166.67 కోట్లను కేబినెట్ కేటాయించింది. దీనివల్ల మంథని నియోజకవర్గంలోని 63 గ్రామాల్లో 45 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. అటు మంచిర్యాల జిల్లాలో మత్స్యకారుల కోసం ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటు చేయనున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద 85.10 ఎకరాల భూమిని మత్స్య శాఖకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చేపల ఎగుమతులు ప్రాసెసింగ్‌కు ఈ పార్క్ కేంద్రబిందువుగా మారనుంది.

ALSO READ: ఆర్టీసీ సమ్మె మరింత ఉదృతం.. ఆరు రోజుల ఉద్యమ కార్యాచరణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు