క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు పరిస్థితి ఉంది. ముఖ్యంగా అమరావతి రాజధానిని ఎవరూ కదిలించలేని రీతిలో చట్టబద్ధత కల్పించేందుకు నడుంబిగించింది కూటమి సర్కార్. పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదించింది. రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ రానుంది. అయితే ఇంతలో జగన్మోహన్ రెడ్డి కొత్త రాజధాని ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులోని.. ఆంగ్ల అక్షరమాలలో పేర్లను కలుపుతూ మావిగన్ అనే పేరుతో రాజధాని ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే దీనిపై రకరకాల ప్రచారం నడుస్తోంది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కు గురయ్యారు జగన్మోహన్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఇప్పటికే రాజధానుల అంశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ డ్యామేజ్ జరిగింది. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్రకటన చేయడం ఏమిటి అనే ప్రశ్న ఉత్పనం అయ్యింది. జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఎవరు రాశారు అంటూ ప్రశ్నించేదాకా పరిస్థితి వచ్చింది.
అది సజ్జల స్క్రిప్ట్ కాదు..
సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటనల విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటారన్నది ఒక వాదన. స్వతహాగా జర్నలిస్ట్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్టును జగన్మోహన్ రెడ్డి చదువుతుంటారని వైసిపి వర్గాల్లోనే ఒక ప్రచారం ఉంది. కానీ ఇటీవల వైసీపీలో పెద్దగా యాక్టివ్ గా లేరట సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ సీనియర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులు.. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి తో ఆయనను జగన్మోహన్ రెడ్డి సైడ్ చేసినట్లు ప్రచారంలో ఉంది. మరి ఈ స్క్రిప్టు ఎవరు ఇచ్చి ఉంటారు? అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాధాన్యత తగ్గిన క్రమంలోనే.. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
తప్పుడు సర్వేలతో..
జగన్ మావిగన్ ప్రకటనతో ఆవేశంలో ఉన్నాయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. వారంతా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఎన్నికలకు ముందు తాను ప్రత్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకొని.. జగన్మోహన్ రెడ్డి వెంట ఉండేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెగ ప్రయత్నం చేశారట. అందుకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించారట. కానీ ఇంతలోనే ఆయనను ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఎన్నికల్లో టికెట్లు కేటాయించడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీరోల్ ప్లే చేశారట. ఆయన ఇచ్చిన సర్వే రిపోర్టులతోనే జగన్మోహన్ రెడ్డి చాలామంది నేతలను నియోజకవర్గాలు మార్చారట. సర్వేలు కూడా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయం అని చెవిరెడ్డి తేల్చారట. జగన్మోహన్ రెడ్డి దీనిని విశ్వసించారట. అటు ఎన్నికల్లో అభ్యర్థుల మార్పు ప్రతికూల ఫలితాలు ఇవ్వగా.. చెవిరెడ్డి ఇచ్చిన సర్వే రిపోర్టులు కూడా తప్పు అని తేలాయి. అందుకే ఆ మధ్యన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టినట్లు ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో బెయిల్ పై బయటకు వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాడేపల్లి కి రావడంతో జగన్ సజ్జలను తప్పించినట్లు ప్రచారం సాగుతోంది. మావిగన్ రాజధాని ప్రతిపాదన స్క్రిప్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చినట్లు వైసిపి వర్గాల్లోనే ఒక ప్రచారం ఉంది. అయితే ఎందుకు చెవిరెడ్డిని జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారో.. సజ్జలను ఎందుకు సైడ్ చేశారో.. ఎవరికి అంతుపట్టడం లేదు.
