* బాహటంగానే వ్యాఖ్యలు చేస్తున్న నేతలు
* అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసిన నాయకులు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో గొంతులు లేస్తున్నాయా? క్రమశిక్షణ గాడిలో తప్పుతోందా? డామేజ్ కంట్రోల్ చేయకపోతే కష్టమా? అంటే అవుననే సమాధానం సమాధానం వినిపిస్తోంది. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో అది స్పష్టంగా కనిపించింది. గతానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీలో వ్యవహార శైలి బయటపడింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్లు బాహటంగానే తమ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇది పార్టీకి ఎంత మాత్రం ప్రయోజనం కాదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలానే నేతల స్వేచ్ఛగా కొనసాగిస్తే మళ్లీ పాత ధోరణి రావడం ఖాయమని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కోమటిరెడ్డి సంచలన కామెంట్స్..
అసెంబ్లీలో నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఏకంగా ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లాతో పాటు సీఎం సొంత నియోజకవర్గంలో చేసిన పనులకు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారని.. ఇతర ప్రాంతాల్లో కాంట్రాక్టర్లకు పెండింగ్లో పెడుతున్నారని వాపోయారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేలు గెలవకపోతే సీఎం కానీ.. మంత్రులు కానీ ఎక్కడ అని లాజిక్ పాయింట్ లేవదీశారు. తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సాగడం లేదని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలకు అభివృద్ధి నిధులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిగా డిఫెన్స్ లో పడేసాయి. కొంతకాలంగా మంత్రి పదవి ఆశిస్తూ వస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. సమీకరణల దృష్ట్యా రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ దక్కడం లేదు. దీంతో తీవ్ర అసహనంతో ఉన్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసినంత పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిపై కూడా మాట్లాడుతున్నారు.
రాములమ్మ విశ్వరూపం..
శాసనమండలిలో చూస్తే ఎమ్మెల్సీ విజయశాంతి సారి కాంగ్రెస్ ప్రభుత్వం పై తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఉద్యమకారులకు ప్రభుత్వం చేసిన న్యాయం ఏమిటని ప్రశ్నించారు. వారికి ఎన్నో రకాల హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఉద్యమంలో అమరులైన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. 25 వేల రూపాయల గౌరవ భృతి కూడా ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. ఉద్యమకారులు లేకుంటే సీఎం అయినా.. మంత్రులు అయినా ఉండేవారా అని ఆమె నిలదీసినంత పని చేశారు. అటు శాసనసభలో ఎమ్మెల్యే.. ఇటు శాసనమండలిలో ఎమ్మెల్సీ ఒకే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒక్కమాటలో చెప్పాలంటే సీఎంతో పాటు మంత్రుల ప్రస్తావన తీసుకురావడం చూస్తుంటే వారిలో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది.
క్రమేపీ మారుతున్న సీన్..
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పారు. గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీని వీడారు. ఈ క్రమంలో కాంగ్రెస్ హై కమాండ్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు. అయితే నేరుగా సీఎంను టార్గెట్ చేస్తుండడం మాత్రం మారుతున్న పరిణామాలకు సంకేతం. ఇలా విమర్శలు చేస్తున్న వారంతా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు కావడం గమనార్హం. మంత్రి పదవులు దక్కలేదని.. తాము ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కడం లేదన్న వారు ఇప్పుడు బాహటంగానే తమ అసంతృప్తిని వెళ్ళగకుతున్నారు. కొద్దిరోజులపాటు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త స్వరాలు పెద్దగా బయటపడలేదు. కానీ జీవన్ రెడ్డి బయటకు వెళ్లి పోవడం.. పార్టీలో సీనియర్లు ఉండగా తన సహచరుడు వేం నరేందర్ రెడ్డి కి రాజ్యసభ పదవి ఇవ్వడం.. శాసనసభలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ గళం ఎత్తడం చూస్తుంటే మాత్రం.. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి అదుపు దాటుతోందన్న అనుమానాలు ఉన్నాయి. మరేం జరుగుతుందో చూడాలి..
