ఏపీలో ప్రభుత్వం నుంచి కొత్త ఇళ్లు ఎప్పుడెప్పుడు మంజూరు అవుతాయా అని ఎదురు చూస్తున్న లక్షలాది మంది ఆశలు నెరవేరే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో కొత్త ఇళ్ల మంజూరుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టత ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ పీఎం ఆవాస్ యోజన పథకంతో కలిపి రాష్ట్రంలో పేదల కోసం ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్న ప్రభుత్వం, ఇల్లు నిర్మించుకునే వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తూ ముందుకు సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే అర్హులైన లబ్ధిదారుల నుంచి గత ఏడాది డిసెంబర్ వరకు దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం, వాటిని పరిశీలించి కేంద్రానికి పంపించింది. ప్రస్తుతం కేంద్ర స్థాయిలో ఆ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుండగా, ఆమోదం వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తుది లబ్ధిదారుల జాబితాను విడుదల చేయనుంది.
ఈ పథకం కింద ఇల్లు నిర్మించుకునే వారికి ఒక్కొక్కరికి రూ.2.39 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వాటిని సమీక్షించిన తరువాత 6.50 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. ఈ జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపించగా, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ధృవీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు తుది ఆమోదం లభించే అవకాశం ఉంది. వచ్చే నెలలోనే ఈ జాబితాకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశముందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారధి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్‌పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అంశంపై సమగ్ర చర్చ జరగగా, త్వరలోనే లబ్ధిదారులకు శుభవార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇదే సమయంలో రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో గ్యాస్ కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచించాలని ముఖ్యమంత్రి సూచించారు. పైప్డ్ నేచురల్ గ్యాస్, ఇండక్షన్ స్టవ్స్ వంటి విద్యుత్ ఆధారిత పరికరాల వినియోగాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి పైప్డ్ గ్యాస్ అందించే దిశగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు ఉన్న పైప్ లైన్ పునరుద్ధరణపై కేంద్రానికి లేఖ రాయాలని సూచనలు ఇచ్చారు. వాణిజ్య రంగంలో నేచురల్ గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించే విధానాన్ని వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశముందని తెలిపారు.
ఇక అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతుల సమస్యలపై కూడా ప్రభుత్వం స్పందించింది. పంట నష్టాన్ని ఎదుర్కొన్న రైతులను గుర్తించి, వారి వివరాలను రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 31 లోగా పూర్తి జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించాలని సూచించారు. జిల్లాల కలెక్టర్లు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. పంట నష్టపోయిన రైతులకు తగిన సహాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తూ, ఈ దిశగా చర్యలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.
ALSO READ: ఐపీఎల్ 2026లో ఏ టీమ్ ఎప్పుడు ఎక్కడ తలపడనుందో తెలుసా?
