Tuesday, March 3, 2026
Homeఅంతర్జాతీయంSaudi Arabia: డ్రోన్ దాడి.. భారీ పేలుళ్లు, చెలరేగిన మంటలు

Saudi Arabia: డ్రోన్ దాడి.. భారీ పేలుళ్లు, చెలరేగిన మంటలు

Saudi Arabia: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ ముదిరుతున్న వేళ మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా ఇవాళ తెల్లవారుజామున భారీ డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. దౌత్య ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. కార్యాలయ ప్రాంగణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించాయి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం రెండు డ్రోన్లు దౌత్య ప్రాంతంలోని భవనాన్ని ఢీకొన్నట్లు తెలుస్తోంది.

దాడి జరిగిన సమయంలో కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. సౌదీ రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో కేవలం స్వల్ప ఆస్తి నష్టం మాత్రమే వాటిల్లిందని పేర్కొన్నారు. అయితే భద్రతా పరంగా ఇది అత్యంత కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఈ దాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారికంగా ఎవరి బాధ్యత అన్నది స్పష్టంగా వెల్లడించలేదు. ఘటన అనంతరం దౌత్య ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడి చేసి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ఇటీవలి కాలంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యలో ఈ దాడి చోటుచేసుకోవడం అంతర్జాతీయ వర్గాల్లో ఆందోళనకు దారితీసింది. ఫిబ్రవరి 28 నుంచి కొనసాగుతున్న పరిణామాలు ప్రాంతీయ స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతున్నాయి. అంతకు ముందు కువైట్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై కూడా ఇలాంటి దాడులు జరిగినట్లు సమాచారం. వరుస ఘటనల నేపథ్యంలో ఈ దాడిని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి బాధ్యులెవరో గుర్తించి తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని హెచ్చరించినట్లు సమాచారం. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలతో పరిస్థితులు మరింత సంక్లిష్టమయ్యే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దౌత్య కార్యాలయాలపై జరుగుతున్న దాడులు అంతర్జాతీయ భద్రతకు సవాలుగా మారుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ALSO READ: Alert: మళ్లీ వర్షాలు పడే ఛాన్స్!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments