ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ సర్కిల్ ఇన్సెపెక్టర్ రాజేందర్ పై మరోసారి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. రాజేందర్ పై గేమింగ్ జోన్ నిర్వాహకుడు సందీప్ రెడ్డి ఆరోపణలు చేశారు, పిర్యాదు లేకుండా పోలీస్ స్టేషన్ పిలిచి తనపై దాడి చేశాడంటూ మీడియా ముందు వాపోయాడు సందీప్ రెడ్డి. సీఐ పంపించిన పోలీసులు తన దగ్గరికి వచ్చి పోలీస్ స్టేషన్ కి రావాలని పిలిచారన్నారు. ఎలాంటి నోటీసు లేకుండా ఎందుకు పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారని అడిగానని సందీప్ రెడ్డి చెప్పారు. ప్రెగ్నెంట్‌గా ఉన్న భార్యను హాస్పిటల్‌కి తీసుకువెళ్తున్నానని చెప్పినా వినిపించుకోలేదన్నారు.
కచ్చితంగా రావాలని చెప్పడంతో భార్యను ఇంట్లో దించేసి పోలీసుల వెంటే ఓయూ పీఎస్ కు వెళ్లాలని సందీప్ రెడ్డి చెప్పారు. స్టేషన్ వెళ్లగానే సీఐ రాజేందర్ పై తనతో చాలా అసభ్య పదజాలంతో మాట్లాడారని తెలిపారు. అలా ఎందుకు మాట్లాడుతున్నారని అడిగినందుకు తపై దాడి చేశారన్నారు.15 మంది పోలీసులు కలిసి కుక్కను కొట్టినట్టు నన్ను.. నా తమ్ముళ్లు ఇద్దరిని కొట్టారని సందీప్ రెడ్డి కన్నీళ్ల పర్యంతమయ్యారు.
ఎందుకు తీసుకొచ్చారో రీసన్ చెప్పకుండానే ఇష్టం వచ్చినట్లు కొట్టారని సందీప్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు తప్పయింది అని చెప్పి మళ్ళీ ఇంటికి పంపిస్తున్నారని.. ఇదెక్కడి న్యాయమని వాపోయారు. అసలు నాపై ఎలాంటి ఫిర్యాదు రాకుండానే పోలీస్ స్టేషన్ పిలిచి కొట్టారని సందీప్ రెడ్డి ఆరోపించారు. తనను కొట్టిన పోలీసులపై అడిషనల్ డీసీపీ నరసయ్యకు ఫిర్యాదు చేశానని చెప్పారు. వాళ్లపై చర్యలు తీసుకోకుంటే డీజీపీ వరకు వెళ్లి ఫిర్యాదు చేస్తానని సందీప్ రెడ్డి తేల్చిచెప్పారు.