తెలంగాణ

దీపావళి కానుక.. ఒక్కో కార్మికునికి 3 లక్షల రూపాయలు

దీపావళి బోనస్ గా పిలవబడే పిఎల్ఆర్ఎస్ (ప్రొడక్షన్ లింక్డ్ రివార్డ్ స్కీమ్) బోనస్‌ను ప్రభుత్వం చెల్లించింది. కార్మికుల బోనస్ కు సంబంధించిన 358 కోట్ల రూపాయలను విడుదల చేయాలని సింగరేణి సీఎండీ బలరామ్ ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.స‌చివాల‌యంలో సింగ‌రేణిపై స‌మీక్ష సంద‌ర్భంగా ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది చెల్లించిన దీపావళి బోనస్ కన్నా ఇది రూ.50 కోట్లు అధికం.
శుక్రవారం మధ్యాహ్నం కల్లా దీపావళి బోనస్ ను కార్మికుల ఖాతాల్లో జమ చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం స్ప‌ష్టం చేశారు.

దీపావళి బోనస్ కింద ఒక్కొక్క కార్మికుడు రూ.93,750 లు అందుకోనున్నారు. దీపావళి బోనస్ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 40,000 మంది కార్మికులకు వర్తిస్తుంది.జే.బీ.సీ.సీ.ఐ. విధానాల్లో భాగంగా కంపెనీలు సాధించిన ఉత్పత్తి పరిమాణం ఆధారంగా కార్మికుల శ్రమకు ప్రోత్సాహకంగా ఈ బోనస్ ను చెల్లించే పద్ధతి గత కొన్నేళ్లుగా అమలులో ఉంటోంది. ఈ ఏడాది కూడా కోల్ ఇండియా స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దీపావళి పండుగకు ముందే చెల్లింపులు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవలే సింగరేణి ఉద్యోగులందరికీ 33 శాతం లాభాల వాటా కింద 796 కోట్ల రూపాయలను కంపెనీ పంపిణీ చేసింది. ఒక్కొక్క కార్మికుడికి సగటున 1 లక్షా 90 వేల రూపాయలు అందాయి. అలాగే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 5 వేల రూపాయల చొప్పున చెల్లించారు. అలాగే పండుగ అడ్వాన్స్ కింద ఒక్కొక్క కార్మికునికి 25వేల రూపాయలు చొప్పున మరో 90 కోట్ల రూపాయలను కంపెనీ చెల్లించింది. ఇప్పుడు దీపావళి బోనస్ కింద ఒక్కొక్కరికి సగటున రూ.93,450లు లభిస్తాయి. మొత్త‌మ్మీద ఈ నెల రోజుల వ్య‌వ‌ధిలో దీపావ‌ళి బోన‌స్‌, లాభాల వాటా, పండుగ అడ్వాన్స్ కింద రూ.1250 కోట్లను సింగరేణి సంస్థ చెల్లించింది. ఈ విధంగా సగటున సింగరేణి ఉద్యోగులు ఈ నెల రోజుల కాలంలో ఒక్కొక్కరు సుమారు మూడు లక్షల రూపాయల వరకు అందుకున్నారు.ఈ బోనస్ డబ్బులను దుబారా చేయవద్దని, ప్రభుత్వ పొదుపు సంస్థల్లో దాచుకోవాలని లేదా కుటుంబ అవసరాలకు అనుగుణంగా జాగ్ర‌త్త‌గా వెచ్చించాలని సింగరేణి కార్మికులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు.

Back to top button